రంగస్థలం..శ్రీ మహాలక్ష్మీ లేడీస్‌ డ్రామా గ్రూప్‌

New play Mahalakshmi Ladies Drama Group and Bombay Gnanam - Sakshi

ఫ్లాష్‌బ్యాక్‌లు సినిమాల్లోనే కాదు నాటకాల్లో కూడా ఉంటాయి. నాటకాల్లోనే కాదు నాటకరంగ సంస్థలకు కూడా ఉంటాయి. ఒక తమిళపత్రికలో నాటకరంగానికి సంబంధించిన వ్యాసం ఒకటి చదివింది జ్ఞానం బాలసుబ్రమణియన్‌. ఒకాయన తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు: ‘తమిళ నాటకరంగంలో రాసే మహిళలు, నటించే మహిళలు లేరు. ఎంతో సామర్థ్యం ఉంటేగానీ ఇది సాధ్యం కాదు అనుకోండి’ ఆయన మాటలను సవాలుగా తీసుకుంది జ్ఞానం. వరకట్న రక్కసిపై నాటిక రాసింది. నిజానికి అంతవరకు తనకు రచన, నాటకరంగంలో ఎలాంటి అనుభవం లేదు. తాను రాసిన నాటికను ఆకాశవాణికి పంపించింది. వారు తిరస్కరించారు.

చిన్న నిరాశ!
జ్ఞానం భర్త పెద్ద అధికారి. ఆయన బాంబేకు బదిలీ అయ్యాడు. భర్తతో పాటు బాంబేకు వెళ్లింది జ్ఞానం. ఒకానొక రోజు వరకట్న సమస్యపై తాను రాసిన నాటికను బాంబేలో ప్రదర్శించారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. తన మీద తనకు నమ్మకం ఏర్పడడానికి ఆ స్పందనే కారణం అయింది. ఈ నమ్మకమే ‘మహాలక్ష్మీ  లేడిస్‌ డ్రామా గ్రూప్‌’ శ్రీకారం చుట్టడానికి నాంది అయింది.

నాటకరంగంలో స్త్రీ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏర్పాటయిందే ఈ డ్రామా గ్రూప్‌. అయితే...రకరకాల భయాల వల్ల ఈ డ్రామా గ్రూప్‌లో చేరడానికి మహిళలు సంకోచించేవారు. ‘ప్రయత్నిస్తే ఫలించనిదేముంది’ అనే నానుడిని మరింత గట్టిగా నమ్మింది జ్ఞానం. ఒకటికి పదిసార్లు వారితో మాట్లాడి ఒప్పించింది. మొదట్లో ఇద్దరు చేరారు. ఆ ఇద్దరు ఆరుగురు ఆయ్యారు... అలా పెరుగుతూ పోయారు. అలా చేరిన వాళ్లు గతంలో ఎన్నడూ నాటకాల్లో నటించలేదు. నటన మీద ప్రేమ తప్ప నటనలో ఓనమాలు తెలియని వాళ్లే.

సాధారణంగా నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరిస్తారు. కానీ ‘మహాలక్ష్మీ లేడీస్‌ డ్రామా గ్రూప్‌’లో పురుష పాత్రలను స్త్రీలే ధరిస్తారు. మొదట్లో ఇది చాలామందికి వింతగా అనిపించేది. ఇది ఆ నాటక సంస్థకు చెందిన ‘ప్రత్యేకత’గా కూడా మారింది. ఈ ఆల్‌–వుమెన్‌ డ్రామా గ్రూప్‌ నుంచి కాలక్షేప నాటకాలు రాలేదు. కనువిప్పు కలిగించే నాటకాలు వచ్చాయి. వర్నకట్నం, వర్కింగ్‌ ఉమెన్స్‌ ఎదుర్కొనే సమస్యలు, బాల్యవివాహాలు...మొదలైన వాటితో పాట ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇతివృత్తాలుగా ఎంచుకుంది ఈ నాటకసమాజం. స్టేజీ ఎక్కడానికి ముందు ఒక్కో నాటకాన్ని ఇంచుమించు 30 సార్లు రిహార్సల్స్‌ చేస్తారు.

కట్‌ చేస్తే....ఇది సోషల్‌ మీడియా కాలం.
ఒక ఊళ్లో నాటకం వేస్తే ఆ ఊరే చూస్తుంది. అదే నాటకం డిజిటల్‌ స్పేస్‌లోకి వస్తే ఊరూ, వాడ ఏమీ ఖర్మ...ప్రపంచమే చూస్తుంది. అలా అని.. రంగస్థలాన్ని తోసిరాజనాలనేది వారి ఉద్దేశం కాదు. ఒకవైపు రంగస్థలానికి ప్రాధాన్యం ఇస్తూనే అదనపు వేదికను కూడా సమర్థవంతంగా  ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయం వెనక కారణం. తొలిసారిగా ‘ఎందరో మహానుభావులు’ యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని మూడు లక్షల మందికి పైగా వ్యూయర్స్‌ చూడడం నాటక సంస్థకు ఎంతో ఉత్సాహం, ధైర్యాన్ని ఇచ్చింది.

‘మహాలక్ష్మీ...ఎందరో మహిళల కలలకు రెక్కలు ఇచ్చింది’ అంటోంది సుదీర్ఘ కాలంగా  ఈ నాటకరంగ సంస్థతో అనుబంధం ఉన్న కమల ఈశ్వరీ. నాటక సంస్థ మొదలైనప్పుడు...సమస్యలు కొన్నే ఉండవచ్చు. ఇప్పుడు ఎటు చూసినా ఏదో ఒక సమస్య. మాధ్యమాలు కూడా పెరిగాయి. ఆ మాధ్యమాల వేదికగా, రకరకాల ఆధునిక సమస్యలపై పోరాడడమే ‘మహాలక్ష్మీ లేడిస్‌ డ్రామా గ్రూప్‌’ లక్ష్యం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top