Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్‌

Neha Bagaria: HerKey Opens Windows Of Opportunities For Women - Sakshi

కొత్త దారి

ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్‌ను రీస్టార్ట్‌ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్‌ ఫర్‌ హర్‌’ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్‌ఫామ్‌ను ‘హర్‌ కీ’ పేరుతో రీబ్రాండ్‌ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా...

రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్‌ రీస్టార్ట్‌ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన నేహా హెచ్‌ ఆర్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్‌ రంగాలలో పనిచేసింది.

2010లో తన కెరీర్‌కు బ్రేక్‌ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్‌ రీస్టార్ట్‌ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన  ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు.

‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్‌ ఫర్‌ హర్‌’ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ స్టార్ట్‌ చేసింది నేహా.

ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్‌ ఫర్‌ హర్‌’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు.

‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్‌ ఫర్‌ హర్‌ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్‌ ఫర్‌ హర్‌’ వెంచర్‌ను ‘హర్‌ కీ’ పేరుతో రీబ్రాండ్‌ చేసింది నేహా. ‘హర్‌ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్‌ ఎసెట్‌... మొదలైన సంస్థలు ఫండింగ్‌ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్‌ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్‌ ఎసెట్‌’ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిధి గుమాన్‌.                    
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top