
మిస్ వరల్డ్ 2025
బ్యూటీ విత్ పర్పస్
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్ ఆసియా పసిఫిక్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్ యూనివర్స్ పోటీ’కీ వెళ్లారు.
అక్కడ ఆమెను జడ్జెస్ మూడు నిమిషాల్లో డొమెస్టిక్ వయొలెన్స్ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి.. ‘2017.. మిసెస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్’ సబ్‌టైటిల్‌నిచ్చారు. హైదరాబాద్ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్, పాజెంట్ గ్రూమర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలా గ్రూమ్ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.
‘2016లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల టైమ్‌కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్ జాబ్ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్‌గా మారాను. క్లాసికల్ డాన్సర్ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్‌నెస్‌లోనూ ట్రైనింగ్ తీసుకుని ఫిట్‌నెస్ కోచ్‌గానూ ఉన్నాను. డివోర్స్ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా.
బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్ సెంటర్స్ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్ దొరికారు. కాన్ఫిడెంట్‌గా నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్ యూనివర్స్ పాజెంట్‌కీ వెళ్లాను. అయితే మిసెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్ పాజెంట్స్ మధ్య సంవత్సరం టైమ్ ఉండింది. అయినా గ్రూమింగ్ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్‌లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పాజెంట్స్‌కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను.
→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే..
మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిసెస్ యూనివర్స్.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. పోటీల షెడ్యూల్ అంతా కంటెస్టెంట్స్‌కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్‌ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ ఉంటుంది.
ఈ కాస్ట్యూమ్స్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ స్పాన్సర్స్‌ని వెదుక్కుంటారు. స్విమ్ వేర్ రౌండ్ ఉంటుంది. స్విమ్ సూట్‌తో స్టేజ్ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్‌ని మనమెంత కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ అసెస్ చేస్తారు. ఇంటెలిజెన్స్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్విజ్ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్‌ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్ పర్పస్ రౌండ్ ఉంటుంది.
కంటెస్టెంట్స్ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్‌లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్‌గా ప్రెజెంట్ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. దీనిమీద ఆన్‌లైన్ ఓటింగ్ ఉంటుంది. మాగ్జిమమ్ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్ పాపులర్ అనే సబ్ టైటిల్ ఇస్తారు. ఫిట్‌నెస్ రౌండ్ ఉంటుంది. అలాగే టాలెంట్ రౌండ్ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్ పెర్‌ఫార్మర్‌కు మిస్ టాలెంటెడ్ సబ్ టైటిల్ ఇస్తారు. ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్‌గా రిప్రెజెంట్ చేస్తున్నామనేది ఫోకస్ అవుతుంది.
→ తలపై బోనంతో....
నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, వన్ టు వన్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్ బ్యూటిఫుల్ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్ స్విమ్ సూట్ లాంటి సబ్‌టైటిల్స్‌నిస్తారు. ర్యాంప్ వాక్ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ వేర్‌ని ఇస్తారు. మాకు సౌత్ ఆఫ్రికన్ ప్రింట్స్, యాక్ససరీస్‌తో డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్‌వరల్డ్ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్ టెన్, లేదా టాప్ ఫైవ్ స్టేజ్ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్ జడ్జెస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్‌గా.. ఎంత కూల్‌గా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి టైటిల్ విన్నర్‌ని, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్స్‌ని అనౌన్స్ చేస్తారు.
→ కొరియోగ్రఫీ..
గ్రూమింగ్ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్ వస్తారు.. ఎవరు ఎలా పెర్‌ఫార్మ్ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్ చేస్తారు. దీనికి పాజెంట్ కోచ్ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్ ఇండియా మొదలు మిసెస్ యూనివర్స్ వరకు గ్రూమింగ్‌కి కాస్ట్యూమ్స్, ఫుట్‌వేర్,యాక్ససరీస్ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్‌లో పార్టిసిపేట్ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్‌నెస్ కోచ్‌గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్‌కి సంబంధించి వర్క్‌షాప్స్ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్ సెంటర్ పెట్టాలని ΄్లాన్ చేస్తున్నాను.
– సరస్వతి రమ