అమ్మ మనసెరిగి ..

Karnataka govt for mental health screening for expecting and new mothers - Sakshi

అమ్మాయి జీవితంలో తల్లికావడం అనేది మహత్తర ఘట్టం. గర్భం దాల్చామని తెలియగానే అమ్మాయితోపాటు, అత్తింటివారి నుంచి పుట్టింటిదాక, అంతా అంతో సంబర పడిపోతుంటారు. అయితే ‘‘ఇవి తినండి, అవి తినండి’’ అని చెప్పేవాళ్లే గానీ, గర్భిణి మానసికస్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచించేవారు తక్కువ. కాబోయే తల్లి ఆనందంతోపాటు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. ఆ ప్రభావం పుట్టిన బిడ్డపై పడుతుంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని గొంతెత్తి చెబుతోంది అన్వితా నాయర్‌. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన 22 ఏళ్ల యంగ్‌ అండ్‌ డైనమిక్‌ మిస్‌ అన్విత ఇలా చెప్పడానికి తనకెదురైన ఓ దుర్ఘటనకు పడిన సంఘర్షణ, కుంగుబాటులే కారణం.

బెంగళూరుకు చెందిన అన్వితా నాయర్‌కు 2017లో ఒకసారి బాగా జ్వరం వచ్చింది. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతుంటే నీరసంగా పడుకుని ఉంది. ఇది చాలదన్నట్టు తనకెంతో ఇష్టమైన ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషాదకర వార్త వినింది. ఈ విషయం తెలిసినప్పుడు అన్విత వయసు 17 ఏళ్లు. తన ప్రాణ స్నేహితురాలు అలా చనిపోవడం జీర్ణించుకోలేక పోయింది. అసలు తను ఎందుకు అలా చేసుకుంది? స్నేహితురాలు లేని లోకాన్ని ఊహించుకోలేక, బాగా కృంగిపోయింది. అలా నాలుగు నెలలపాటు సరిగా నిద్రకూడా పోలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ డిప్రెషనకు లోనైంది.

అన్ని రోగాల్లా కాదు..
నెలలతరబడి డిప్రెషన్‌ లో ఉన్న అన్విత చదువులో బాగా వెనుబడిపోతుండేది. ఫలితంగా ఇంజినీరింగ్‌ సెమిస్టర్‌ను రాయలేకపోయింది. ‘‘ఇది అన్ని రోగాలలా కాదు. మానసిక వ్యాధి. దీనిలో ఉంటే మరింత దిగజారిపోతావు. మందులు వాడితే బయటపడవచ్చు’’ అని అంతా సలహా ఇవ్వడంతో సైకాలజిస్టుని కలిసి, థెరపీ తీసుకుంది. థెరపీతో త్వరగానే అన్విత మానసిక ఆరోగ్యం కుదుటపడింది. ఒకపక్క ఇంజినీరింగ్‌ సిలబస్‌ చదువుతూనే మరోపక్క మానసిక ఆరోగ్యం గురించిన పుస్తకాలు చదివేది. అలా మానసిక సమస్యలపై చక్కటి అవగాహన పెంచకున్న అన్విత..తను ఎదుర్కొన్న మానిసిక సంఘర్షణ, కుంగుబాటులను ఎవరూ ఎదుర్కోకూడదని అందరి దగ్గర డిప్రెషన్‌  గురించి ప్రస్తావన తీసుకొచ్చి అవగాహన కల్పిస్తుండేది.

కేసు స్టడీల ద్వారా...
 మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తూనే, మానసిక ఆరోగ్యం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు నెట్‌లో వెతికేది. ఈ క్రమంలో ‘‘12–25 శాతం మంది మహిళలు మాతృసంబంధమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో యాభైశాతంమందికి కూడా తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలియదు. దీని ప్రభావం తల్లీ్లబిడ్డలపై పడుతుంది’’ అని తెలుసుకుంది. అది అలాగే కొనసాగితే పిల్లల భావోద్వేగ, శారీరక, నాడీ సంబంధిత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించింది. ప్రెగ్నెంట్‌ మహిళ గైనకాలజిస్టుని సంప్రదించినప్పుడు తల్లీ, కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ, తల్లి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అందువల్ల ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ సమస్య గురించి వెలుగులోకి తెచ్చి అవగాహన కల్పించాలనుకుని అప్పటి నుంచి తల్లి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది.

వెబ్‌సైట్‌ ద్వారా...
గతేడాది ‘ప్యాట్రనస్‌ మెంటల్‌హెల్త్‌ డాట్‌కమ్‌’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. మానసిక ఆరోగ్యంపై కంటెంట్‌ను పోస్టు చేస్తుంది. అంతేగాక ఈ ఏడాది జూన్‌ లో చేంజ్‌డాట్‌ ఓఆర్జీ వేదికగా, మాతృ సంబంధమైన మానసిక సమస్యలను గుర్తించాలని కోరింది. అంతేగాక కర్ణాటక మానసిక ఆరోగ్యం విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని, మాత్ర సంబంధ మానసిక సమస్యలను ఏర్పాటు చేసి, వాటికి ప్రచారం కల్పించాలని ప్రభుత్వాలను కోరుతోంది.

నేను తల్లయ్యేనాటికి..
‘‘ఈ రోజు నేను తల్లిని కాకపోవచ్చు. భవిష్యత్‌లో తల్లినవుతాను. అప్పుడు నెలవారి చెకప్‌లలో భాగంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు మానసిక సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను. శారీరక ఆరోగ్యంపై మానసిక సమస్యల ప్రభావం తప్పకుండా పడుతుంది. అమ్మాయిలు విషయాన్ని త్వరగా బయటకు చెప్పుకోలేరు. తమలో తామే కృంగిపోతుంటారు. ఇది అమ్మాయికి గానీ, తన భవిష్యత్‌ కుటుంబానికిగానీ మంచిది కాదు. అందుకే అందరూ మానసిక సమస్యలపై బాహాటంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి’’ అని అన్విత చెప్పింది.
 
అన్వితా నాయర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top