హైదరాబాద్‌లోని బోరబండ చౌరస్తా దాటి వెళుతున్న సుందరం దృష్టి ఒక మూలన ఉన్న చెత్తకుప్పపై పడింది. ఆ చెత్తకుప్పపై మెరుస్తున్న దీపం ఒకటి కనిపించింది.
‘కొంపదీసి... ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం అయితే కాదు కదా!’ అనుకున్నాడు మనసులో.
‘యస్’ అనే మాట నలుమూలలా రీసౌండ్ ఇచ్చింది.
పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్లి ఆ దీపాన్ని చేతిలోకి తీసుకున్నాడు సుందరం.
‘కమాన్... టెల్‌మీ... ఏం కావాలో కోరుకో’ అని అడిగింది దీపంలోని జిన్నీ భూతం.
‘ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చా?’ ఆత్రంగా అడిగాడు సుందరం,
‘యస్’ అని చెప్పింది జిన్నీ.
...సుందరం తన కోరికల చిట్టా విప్పాడు.
‘నాకు ప్రపంచంలో ఏ భాష అయినా తెలిసి ఉండాలి’ అడిగాడు సుందరం.
జిన్నీ: ఓకే.
‘నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కానీ వేయడం రాదు. నేను ఏ బొమ్మ అయినా స్పీడ్‌గా గీసేలా వరం ఇవ్వు’
జిన్నీ: ఓకే
పోరపాట్లు చేయడం తప్ప నాకు సలహాలు ఇవ్వడం రాదు. ఎవరు ఏ సలహా అడిగినా సలహా ఇచ్చే శక్తి ఇవ్వు’
జిన్నీ: ఓకే
సుందరం:
‘ఎవరి గొంతునైనా ఈజీగా ఇమిటేట్ చేయాలి’
‘పాటలు అలవోకగా రాసే టాలెంట్ ఇవ్వు’
‘సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసే టాలెంట్ ఇవ్వు’
‘సినిమా కథలు రాసే టాలెంట్ ఇవ్వు’
‘పుస్తకాలు రాసే టాలెంట్ ఇవ్వు’
‘అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించే టాలెంట్ ఇవ్వు’
‘అద్భుతమైన ప్రేమ లేఖలు రాసే అదృష్టం ఇవ్వు’
‘ఏఐ గురించి నాకు బొత్తిగా తెలియదు. అలాంటి నాకు ఏఐ క్లాసులు చెప్పే శక్తి ఇవ్వు’
‘నేను అందంగా లేకపోయినా చాలా అందంగా కనిపించే వరం ఇవ్వు’
జిన్నీ: ఓ... ఓ... ఓ...
కట్ చేస్తే....
బోరబండ వాసి అయిన సుందరం అక్కడెక్కడో అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’లో చాట్‌బాట్‌గా మారిపోయాడు!!!!!
‘ఇది అన్యాయం, అక్రమం, దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం, శోచనీయం, గర్హనీయం, అమానవీయం, ఆక్రోశనీయమ్’..... అంటూ ఏడుపు అందుకున్నాడు సుందరం.
అప్పుడు జిన్నీ భూతం ప్రత్యక్షమై... ‘నువ్వు ఏం కోరుకున్నావో... అవన్నీ చాట్‌జీపీటీ చేస్తుంది. అందుకే ఆల్ ఇన్ వన్‌గా చాట్‌జీపీటిగా మార్చాను’ అని చావు న్యూస్ చల్లగా చెప్పి మాయమైంది.
– యాకుబ్ పాషా


