ప్రకృతి ఒడిలో... చెట్టు బడి నీడలో! | This Delhi IRS Officers School of Trees Is Helping Children Learn From Nature | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో... చెట్టు బడి నీడలో!

Mar 28 2026 2:23 AM | Updated on Mar 28 2026 2:23 AM

This Delhi IRS Officers School of Trees Is Helping Children Learn From Nature

ఏడంతస్తుల మేడల్లో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతికత మధ్య పిల్లలు పాఠాలు నేర్చుకోవడం మాట ఎలా ఉన్నా, చాలామంది పిల్లలు పాఠాలకే పరిమితం అవుతూ ప్రకృతికి దూరం అవుతున్నారు. ఈ తరం పిల్లలకు ప్రకృతి ఒడిలో పాఠాలు చెబుతూ చెట్లు, పర్యావరణం గురించి తెలుసుకునేలా దిల్లీలో ‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’ను స్థాపించారు రోహిత్, గీతాంజలి దంపతులు...  దిల్లీలోని కిద్వాయ్‌నగర్‌లోని ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం కొంతమంది పిల్లలు ఒక చెట్టు చుట్టూ అర్ధవలయాకారంలో నిలబడి ఉన్నారు. ఐఆర్‌ఎస్‌ అధికారి రోహిత్‌మెహ్రా చెట్టు బెరడుపై తన వేళ్లను సున్నితంగా ఆడిస్తూ ‘ఇది చెట్టు మాత్రమే కాదు. ఇక్కడ జీవం మొదలవుతుంది’ అని చెప్పారు.

పిల్లలు ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నారు.
చెట్టు ఎలా శ్వాసిస్తుంది? కిరణజన్య సంయోగక్రియ ఎందుకు ముఖ్యమైనది?... పిల్లలు అడిగే ఇలాంటి ప్రశ్నలకు ఆయన ఓపికగా, వారికి అర్థమయ్యేట్లు సమాధానం ఇచ్చారు. అది ప్రకృతియే తరగతి గదిగా, గురువుగా ఉండే వినూత్నమైన పాఠశాల...స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌.

ట్రీ హాస్పిటల్‌
‘గత పన్నెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా జీవిస్తున్నాం. మా సెలవులను. ఖాళీ సమయాన్ని పిల్లలతో గడపడంలో సంతోషంగా ఉంటున్నాం’ అంటున్నారు రోహిత్, గీతాంజలి దంపతులు. నిజానికి ‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’కు ముందే ఈ దంపతులు పర్యావరణ సంరక్షణ తమ దైనందిన అలవాటుగా చేసుకున్నారు. వ్యాధిగ్రస్తమైన చెట్లకు చికిత్స అందించడానికి కొన్ని సంవత్సరాల క్రితం అమృత్‌సర్‌లో భారతదేశంలోనే తొలిసారిగా ‘ట్రీ హాస్పిటల్‌’ స్థాపించారు.

పర్యావరణ జీవనవిధానం
పర్యావరణ స్పృహ అనేది కేవలం కార్యాచరణగా కాకుండా జీవనవిధానంగా ఉండాలనేది వారి సిద్ధాంతం. ఉదయాన్నే పిల్లలను బయటకు తీసుకువెళ్లి రకరకాల చెట్లను చూపిస్తూ వాటి గురించి వివరంగా చెబుతుండేవారు. వాళ్లచేతనే మొక్కలు నాటించేవారు. ఇవి చిన్న పనులే అయినా వారి లేత మనసులలో ‘పర్యావరణ పరిరక్షణ’ అనే భావనను గట్టిగా నాటాయి.

పట్టణాల్లో ఉండే పిల్లలను గమనించినప్పుడు ప్రకృతి ప్రపంచానికి వారు చాలా దూరంగా ఉన్నారనే విషయం అర్థమైంది. ‘నేటితరం పిల్లలకు కార్ల బ్రాండ్లు, సినిమా ట్రెండ్‌ల గురించి బాగా తెలుసు. అలాంటి పిల్లలకు చెట్లు, పర్యావరణం పట్ల అదే ఉత్సుకతను ఎందుకు పెంపొందించలేము? అనే కోణంలో ఆలోచించాం. పిల్లలకు ప్రకృతిపై అవగాహన లోపం మాత్రమే సమస్య కాదని, భావోద్వేగ అనుబంధం లేకపోవడమే అసలు సిసలు సమస్య అని గ్రహించాం’ అంటున్న ఈ దంపతులు గత సంవత్సరం దిల్లీలోని కిద్వాయ్‌నగర్‌ కాలనీలో ‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’ ప్రారంభించారు.

నిశ్శబ్ద గురువులు
స్కూల్‌ ప్రత్యేకత విషయానికి వస్తే....నిరాడంబరంగా ప్రారంభమైంది. తరగతి గదులు లేవు. అరువు తెచ్చుకున్న సిలబస్‌ లేదు. కేవలం చెట్లు, మట్టి, ఉత్సాహం మాత్రమే ఉన్నాయి. ‘చెట్లు అంటే కేవలం చెట్లు మాత్రమే కావు. అవి నిశ్శబ్ద గురువులు. మనం తినే ప్రతీది, మనం తాకే ప్రతీది ఇక్కడే మొదలవుతుంది’ అనే సందేశాన్ని పిల్లల మనసులోకి తీసుకు వెళ్లారు. ‘కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతే మనకు తెలిసిన జీవితం ఆగిపోతుంది. ఆకులు తమ మనుగడ కోసం ఒకదానిపై ఒకటి అల్లుకుంటూ కలిసి పెరుగుతాయి. మనం కూడా వాటి నిశ్శబ్ద కృషి నుంచి నేర్చుకోవాలి’ అని చెబుతున్న రోహిత్‌–గీతాంజలి దంపతులు ఆసక్తికరమైన వర్ణమాలను సృష్టించారు.
ఉదా: ‘బి’ ఫర్‌ బ్యాంబూ ‘ఇ’ ఫర్‌ ఎర్త్‌ ‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’లో ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉండదు. ఆసక్తి ఉంటే చాలు.

ట్రీ పార్టీ
ప్రకృతి మధ్య, ప్రకృతి సంబంధిత పదాలతో భాష నేర్చుకోవడం ఎంత బాగుంటుంది! 
ట్రీ స్కూల్‌’లో పాఠాలు నేర్చుకోవడం పనిలా అనిపించదు. అదొక ఆటలా అనిపిస్తుంది. పిల్లలకోసం ప్రతి వారాంతంలో ‘ట్రీ పార్టీ’లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బల్లలు ఉండవు, ‘కదలకుండా కూర్చోవాలి’ అనే నియమాలు ఉండవు. మెత్తటి పచ్చిక బయళ్లు, ఆకాశమంత ఎత్తైన చెట్ల కాండాలను చూస్తూ, సేద తీరుతూ, ఆటలు ఆడుతూ కనపిస్తారు పిల్లలు. పిల్లలు ఆడే ఆటల్లో ఒకటి... చెట్లను గమనించే ఆట. ఒక అమ్మాయి/అబ్బాయి స్టాప్‌వాచ్‌ 

పట్టుకోగా, మిగతా పిల్లలు ఒక నిమిషం వ్యవధిలో తమ పరిసరాలలో ఉన్న చెట్ల పేర్లు చెప్పాలి. గెలిచిన వారికి చాక్లెట్లు బహుమానంగా ఇస్తారు. మరొకదానిలో... పిల్లలకు విత్తనాలు, కుండీలు ఇచ్చి ‘నాటండి. నీరు పోయండి, గమనించండి’ అంటూ సులభమైన సూచనలు ఇస్తారు.‘చెట్లు అనేవి పాఠశాలలో నేర్చుకునే పాఠాలు కాదు. కంఠస్థం చేసే నిర్వచనాలు కావు. మొక్కలు నాటుతూ, రోజూ వాటిని పలకరిస్తూ, వాటి ఎదుగుదలను చూడడమే అసలు సిసలు పాఠం’ అంటుంది సాక్షి అనే విద్యార్ధిని.

మట్టిపరిమళం తెలిసింది
‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’లోని పాఠాలు తరగతి గదికి మాత్రమే పరిమితమైనవి కావు. అవి పిల్లలతో పాటు వారి ఇంటికి వెళతాయి. ఒకసారి క్లాస్‌లో పాత ప్లాస్టిక్‌ సీసాలను మొక్కలు నాటే తొట్టెలుగా ఎలా ఉపయోగించాలా పిల్లలకు చూపించారు. అవి చూసిన పిల్లలు తమ ఇంట్లో వాటిని తయారుచేశారు. ఒకప్పుడు మట్టిని మట్టుకోవడానికి సంకోచించే పిల్లలు ఇప్పుడు తమ సైకిళ్లపై కుండీలను జాగ్రత్తగా పెట్టుకొని సగర్వంగా ఇంటికి వెళుతున్నారు.

వారు తమ మొక్కలకు నీళ్లు పోస్తారు. వాటి పెరుగుదలను గమనిస్తారు. పర్యావరణానికి సంబంధించి తల్లిదండ్రులకు స్ఫూర్తిని ఇస్తారు. ‘ఇంట్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపిస్తే వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తుంటాను’ అంటుంది పన్నెండు సంవత్సరాల మీనాక్షి. మామిడి మొక్క నాటాలనేది ఆమె కల. ఇలాంటి కలలెన్నో ‘స్కూల్‌ ఆఫ్‌ ట్రీస్‌’ పిల్లలకు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement