ఒంటి అలంకరణ వస్తువులతో ఇంటి అలంకరణ

Home Creations With Recycling Ornaments - Sakshi

ఇంటిని అందంగా అలంకరించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం మంచిది. ఉన్న వస్తువులతో రీ సైక్లింగ్‌ చేసే పద్ధతులు తెలుసుకుంటే చాలు ఇంటిని వినూత్నంగా మార్చుకోవచ్చు. అందుకు ఫ్యాషన్‌ యాక్ససరీస్‌ అదేనండీ ఒంటి అలంకరణ వస్తువులను చూపులను ఆకట్టుకునే విధంగా ప్రతి పీస్‌ను ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. 

చెవి రింగులు, మెడకు చుట్టుకునే స్కార్ఫ్, వేసుకునే హై హీల్స్, పట్టుకొనే గొడుగు.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం. ఫ్యాషన్‌ యాక్ససరీస్‌ ఉపయోగించేవాటికన్నా పక్కన పెట్టేసేవి ఎక్కువే ఉంటాయి. అంతగా కొని దాచిపెట్టేస్తారు కాబట్టి, వీటితోనే ఇంటి అలంకరణ చేసేస్తే.. ఇంట్లో వారి మెప్పుతో పాటు ఇంటికి వచ్చే అతిథులు మార్కులు కూడా కొట్టేయొచ్చు. అయితే, ఇప్పుడే స్టార్ట్‌ చేద్దాం...

సిల్క్‌ స్కార్ఫ్‌
బయటకు వెళితే కుర్తీ, టాప్‌కి కాంబినేషన్‌గా మెడలో స్కార్ఫ్‌ ఉండాల్సింది. అందమైన స్కార్ఫ్‌లు ఎన్నో మీ వద్ద ఉండే ఉంటాయి. కొన్ని స్కార్ఫ్‌ల డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి. ఫ్రేమ్‌లో స్కార్ఫ్‌ని సెట్‌ చేస్తే, అందమైన వాల్‌ ఆర్ట్‌ అలంకరణకు రెడీ. ఇందుకు ఫ్రేమ్‌ ఎంపిక ఒక్కటే మీ ఛాయిస్‌. మీ అభిరుచిని బట్టి ఎన్ని స్కార్ఫ్‌లు అయినా మార్చుకుంటూ రోజుకో ఆర్ట్‌ని ఆస్వాదించవచ్చు. 

వేలాడే జూకాలు
అతివల హృదయానికి చేరువగా ఉండేది ఆర్ట్‌. అందుకే, వారికి కావల్సిన ప్రతీ వస్తువూ కళాత్మకంగా ఉండేది ఎంచుకుంటారు. వాటిలో చెవి రింగులు ప్రధానమైనవి. ఒక మంచి ఫ్రేమ్‌లో అమర్చి, లివింగ్‌ రూమ్‌లో అలంకరించి, ఆ అందమైన తేడాను మీరే గమనించవచ్చు. 

బరువైన బ్యాంగిల్‌.. పేపర్‌వెయిట్‌
ఇత్తడి, రాగి, గాజు మెటీరియల్‌తో తయారైన సింగిల్‌ హెవీ బ్యాంగిల్స్‌ను మన దగ్గర చాలానే ఉంటాయి. బరువుగా ఉందనో, మరోసారి వాడుదామనో పక్కన పెట్టేసిన ఇలాంటి గాజును టేబుల్‌ పెపర్‌వెయిట్‌గా ఉపయోగించుకోవచ్చు. వీటి డిజైన్‌ కూడా చాలా కళాత్మకంగా ఉండటంతో చూడగానే ఆకట్టుకుంటుంది. 

గొడుగు దీపాల జిలుగులు
ఎండ, వానల సమయాల్లో అందమైన గొడుగుల సంఖ్య మన దగ్గర చేరుతూనే ఉంటాయి. ఏదైన టూర్లకు వెళ్లినప్పుడు కూడా చిన్న చిన్న గొడుగులను సేకరించే అలవాటు ఉంటుంది. వీటిని ఇలా విద్యుత్‌ దీపాలకు అడ్డుగా పెట్టి, ఇంటి అలంకరణలో రెట్టింపు కళ తీసుకురావచ్చు. 

బ్యాగులే శిల్పాలు
పాడైన ఫ్యాన్సీ బ్యాగులు, క్లచ్‌లు, శాండల్స్, ఉపయోగించని లిప్‌స్టిక్‌ వంటివి కవర్‌లో పెట్టి, మూలన పడేయాల్సిన అవసరం లేదు. వాటికి కొంచెం సృజనాత్మకత జోడించి, శిల్పాలుగా మార్చుకోవచ్చు. ఇంటి గ్లాస్‌ షోకేస్‌లో అందంగా అలంకరించుకోవచ్చు. 

మీకు కావల్సిందల్లా కొంచెం ఊహ, మరికొంచెం సృజనాత్మకత.. ఇలా మీ ఆలోచనా సామర్థ్యాన్ని బట్టి ఉన్న వస్తువులతోనే ఇంటిని కొత్తగా అలంకరించవచ్చు.  

చదవండి: Home Creations: అలంకరణలో ఇదో విధం..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top