లిటిల్‌ డాక్టర్‌ | Helping Kids Stay Safe, Healthy During Summer Break | Sakshi
Sakshi News home page

లిటిల్‌ డాక్టర్‌

Apr 17 2026 3:54 AM | Updated on Apr 17 2026 3:54 AM

Helping Kids Stay Safe, Healthy During Summer Break

ఆరోగ్య అవగాహన

పిల్లలు రోజులో ఎన్ని నీళ్లు తాగాలి, వ్యాయామం ఎందుకు అవసరం, కూల్‌ డ్రింక్స్‌ ఎందుకు తాగకూడదు, రోజులో విశ్రాంతి ఎంత అవసరం, సన్‌స్ట్రోక్‌ తగిలితే ఏం చేయాలి, చిన్న చిన్న గాయాలకు ఫస్ట్‌ ఎయిడ్‌ ఎలా చేయాలి... ఇలా ఈ వేసవిలో ఆరోగ్య అవగాహన వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫన్‌గా, ఉపయుక్తంగా హెల్దీ కిట్‌ను అందిద్దాం..

ఎండ వేడికి ఒంట్లోని నీరు ఆవిరైపోతుంటుంది. శరీరం అలసటగా మారిపోతుంటుంది. స్కూల్‌ లేదని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం సాధారణమే. పెద్దలు కూడా సెలవులే కదా... అని వదిలేస్తుంటారు. అలాగే ఆహారం, శారీరక శ్రమ గురించి అంతగా శ్రద్ధ చూపరు. ఆ నిర్లక్ష్యం మిగతా వాటిపైనా ప్రభావం చూపుతుంది. ఎండ తీవ్రతకు డీహైడ్రేషన్ , స్కిన్‌ ర్యాషెస్, కడుపునొప్పి, తలనొప్పి.. వంటి సమస్యలూ తలెత్తవచ్చు. అవగాహన పాఠాన్ని ఆచరణలో చూపిస్తే మేలైన ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.

→ సూపర్‌ హీరో ఛాలెంజ్‌
→ నీళ్లు తాగడం బోర్‌ అని పిల్లలు అనకుండా ఉండాలంటే రోజుకు 6–8 గ్లాసుల ‘వాటర్‌ ఛాలెంజ్‌’ ఇవ్వచ్చు. ‘నీళ్లు తాగకుంటే శరీరం వేడెక్కుతుంది’ అని చెప్పి, ప్రతి గ్లాస్‌కు ఒక స్టార్, వారం రోజులు పూర్తయితే చిన్న రివార్డ్‌ ఇచ్చి ప్రోత్సహించవచ్చు. కూల్‌ డ్రింక్స్‌ కాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, బటర్‌మిల్క్‌... వంటి సహజ పానీయాల గురించి చెప్పి వాటిని తయారు చేయించవచ్చు.  
→ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలలోపు బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణగా టోపీ, సన్ గ్లాసెస్, సన్‌స్క్రీన్, కాటన్  దుస్తులు, బ్యాగ్, వాటర్‌ బాటిల్‌.. ఇలా ఏయే వస్తువులు ఉపయోగించాలో ఒక పజిల్‌ టాస్క్‌గా ఇవ్వచ్చు.  
→ ఐస్‌క్యూబ్స్‌ వేసిన పానీయాలు గొంతునొప్పి, జలుబు .. వంటి సమస్యలకు ఎలా కారణం అవుతాయో డిజిటల్‌ మీడియాలో వచ్చిన వీడియోలను చూపి తెలియజేయవచ్చు. 
→ పొట్ట తేలికగా ఉండేలా పండ్లు, కూరగాయలు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పి, జంక్‌ ఫుడ్, వేయించిన పదార్థాలకు ఎందుకు దూరంగా ఉండాలో వివరించవచ్చు. 
∙చెమట వల్ల వచ్చే స్కిన్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకు రోజూ స్నానం చేయడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని అలవాటు చేయాలి. 
→ ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ఆరు బయట ఆటలను ప్రోత్సహించాలి.
→ తలనొప్పి, తిమ్మిరి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పెద్దలకు తెలియజేయడం వల్ల సమస్యకు సత్వర పరిష్కారం ఉంటుందని చెప్పాలి.

→ ఆటగా డాక్టర్‌ గేమ్‌...
పిల్లలకు ఫస్ట్‌ ఎయిడ్‌ నేర్పడం అంటే కేవలం గాయాలకు ఎలా చికిత్స చేయాలో చెప్పడం మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా స్పందించేలా తయారు చేయడం కూడా.  
→ ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో ఉండాల్సిన వస్తువుల గురించి అవగాహన కల్పిస్తూనే, గాయాలకు ప్రథమ చికిత్స ఎలా చేసుకోవాలో నేర్పించాలి. 
→ ముక్కు నుండి రక్తస్రావం అయితే ఏం చేయాలి, ఏదైనా కారణం చేత పెద్ద గాయం అయినా, వాపు సంభవించినా పెద్దలను లేదా డాక్టర్‌ను సంప్రదించడం గురించి చెప్పాలి.
→ అత్యవసర నంబర్లను పిల్లలకు నేర్పాలి. డాక్టర్‌–పేషంట్‌ గేమ్‌ను ఆడించవచ్చు. 
→ హెల్త్‌ అవేర్‌నెస్‌ క్యాంపులకు తీసుకెళ్లవచ్చు. చొరవ తీసుకొని తమ కమ్యూనిటీలలో హెల్త్‌ అవేర్‌నెస్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహించవచ్చు. 
→ మార్కెట్లో లభించే డాక్టర్‌ కిట్‌ టాయ్, ఆర్గాన్‌ టాయ్స్‌తోనూ అవగాహన కలిగించవచ్చు.

→ ప్లేటు నిండుగా ఆరోగ్యం..
హెల్త్‌ టాపిక్‌ను ఒక క్లాస్‌లా చెబితే... దూరంగా వెళ్లిపోతారు. అలా కాకుండా ప్లేట్‌ మీద చూపించవచ్చు. పుచ్చకాయ ‘ఇది నీళ్లు ఎక్కువగా ఇస్తుంది. కీరా.. ఇది శరీరాన్ని కూల్‌ చేస్తుంది’ ఇలాంటి ఉదాహరణలు పరిచయం చేయవచ్చు. జంక్‌ ఫుడ్‌ ఎక్కువైతే బాడీ ఏ విధంగా అలసిపోతుందో చెప్పవచ్చు. 

వాస్తవానికి దగ్గరగా! 
వేసవిలో నిద్ర, ఆహారం విషయంలో క్రమశిక్షణ ఉండదు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది. టీవీ, మొబైల్స్‌ను ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయో చూపాలి. స్కూల్‌ టైమ్‌ పాఠాల మాదిరి ఆరోగ్య సందేశాలను ఇవ్వకూడదు. ప్రతీది  ప్రాక్టికల్‌గా చూపుతూ, పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేస్తూ ఆరోగ్య అవగాహన కలిగించాలి. 

– డా.పి.జ్యోతిరాజ, లైఫ్‌ స్కిల్‌ ట్రైనర్‌

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement
 
Advertisement
Advertisement