
సైకిల్ పట్ల నగరవాసుల్లో ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా చాలా మంది సైకిల్ వినియోగం పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పర్యావరణ ప్రేమికులు, ఐటీ నిపుణులు పలు కారణాలతో సైకిల్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ మంచిదని, అనారోగ్య సమస్యలు దూరమవ్వాలంటే సైకిల్ తొక్కడం ఓ మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మధ్యవయస్కులు, పెద్దలు విరివిగా సైకిల్ వినియోగిస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్‌లో గిరాకీ పెరిగిందని పలువురు చెబుతున్నారు.
– జవహర్‌నగర్
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక పోకడలు, ప్రాశ్యాత్య సంస్కృతి పెరిగిపోయింది. యువతతో పాటు మధ్య వయసు్కలు సైతం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సాధనలో పడిపోతున్నారు. దీంతో మార్కెట్‌లో యంత్రాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా శారీరక శ్రమ తగ్గిపోయి అనారోగ్యాల బారినపడుతున్నారు. మరోవైపు ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
దీంతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. శారీరక శ్రమ తగినంత లేకపోవడమే దీనికి కారణమని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. రోజులో కనీసం గంట సేపైనా వ్యాయామం చేయాలని, లేందటే కనీసం సైకిల్ వినియోగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ వినియోగించే వారి సంఖ్య నగరంలో గణనీయంగా పెరుగుతోంది.
నగర ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై కరోనా తర్వాత వచ్చి మార్పుతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు రోజు రోజుకూ మెట్రో నగరాల్లో దెబ్బతింటోన్న పర్యావరణ సమతుల్యత, కాలుష్యం గాడిన పడాలంటే సైకిళ్ల వినియోగమూ ఓ పరిష్కారమని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పెరుగుతున్న వాడకం..
పట్టణాల్లో పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, వ్యయాలు, ఆరోగ్య పరిరక్షణ కూడా సైకిల్ వైపు మళ్లడానికి ఓ కారణమని ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వే చెబుతోంది. నగరంలో ట్రాఫిక్ కారణంగా ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయని, అవసరానికి మించి ఇంధనం ఖర్చవుతోందని, దీని ఫలితంగా కాలుష్యం కూడా పెరుగుతోందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కూడా కొందరు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సైకిళ్లవైపు దృష్టిసారిస్తున్నారని ఈ అధ్యయనం చెబుతోంది.
యువతలోనూ పెరిగిన ఆసక్తి..
నగరాలతో పోలిస్తే నగర శివారు ప్రాంతాల్లో నివాసముండే యువత సైకిల్ వినియోగం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యార్థులు దగ్గర్లోని పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడానికి, లోకల్‌లో పనులు చక్కబెట్టుకోడానికి సైకిల్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలో అయితే ఫిట్‌నెస్‌పై దృష్టిసారించేవారు, ఆరోగ్య సమస్యలను దూరంచేసుకోవాలనుకునే వారు వీటిని వాడుతున్నారు.
సైకిళ్ల గిరాకీ పెరిగింది..
గతంలో కంటే ఇప్పుడు సైకిల్ కొనే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమ్మకాలు బాగున్నాయి. అన్ని వయసుల వారికీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించుకునేందుకు కొందరు, డాక్టర్ల సలహా మేరకు కొందరు వాడుతున్నారు.
– జ్ఞాన్‌రాం, సైకిల్‌షాపు యజమాని, జవహర్‌నగర్
ఆరోగ్యానికి మేలు..
సైకిల్ వినియోగం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. రోజూ కనీసం పది కిలోమీటర్లు సైకిల్ వినియోగిస్తా.
– బొంకూరి రమేష్, కరాటే మాస్టర్
వ్యాధులకు దూరంగా..
సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు వంటి సమస్యలుకు చక్కని పరిష్కారం. రోజుకు గంటపాటు సైకిల్ తొక్కితే మంచిది. దీనిద్వారా జీర్ణశక్తి మొరుగుపడుతుంది.
– డాక్టర్ అశోక్, జవహర్‌నగర్
(చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు)