ఇంకా కోలుకోలేదా?... ఆందోళన వద్దు! 

Health Tips By Chris Bitling Post Covid Syndrome Affected By People - Sakshi

కరోనా వచ్చి... ఐదు, ఆరు, ఏడు నెలలు గడుస్తున్నా ఇంకా కోలుకోలేదా? తీవ్రమైన నీరసం ఏపనీ చేసుకోనివ్వడం లేదా? ఇంకా ఒళ్లునొప్పులు వేధిస్తున్నాయా? తీవ్రమైన నిద్రలేమి వెంటాడుతోందా? అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెబుతున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.  

సాధారణంగా కరోనా వచ్చి తగ్గాక నాలుగు వారాల నుంచి పన్నెండు వారాల్లో సాధారణంగా లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. కానీ కొందరిలో ఏడాది గడిచాక కూడా తీవ్రమైన నిస్సత్తువ, అలసట, కండరాల నొప్పులు, ఒళ్లంతా నొప్పులు, రాత్రంతా ఏమాత్రం నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలను బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లెయిసెస్టర్‌ అనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మరీ ముఖ్యంగా మహిళల్లో, స్థూలకాయం ఉన్నవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉండిపోవడాన్ని గమనించారు. అందునా వెంటిలేటర్‌పైకి వెళ్లిన రోగుల్లో ఈ లక్షణాలు మరింత సుదీర్ఘకాలం పాటు ఉండిపోవడాన్నీ గుర్తించారు. 

లక్షణాలు అలాగే ఉండటంతో కరోనా ప్రభావం ఇంకా ఉందా అనే ఆందోళన బాధితుల్లో వ్యక్తం కావడం సహజం. కానీ దీన్ని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. అయితే నిద్రలేమి, గుండెజబ్బుల వంటి మరికొన్ని సంబంధిత సమస్యలకు దారితీస్తాయి కాబట్టి ఈ అనుబంధ సమస్యలకు చికిత్స తీసుకుంటే చాలని సూచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి, 2020 నుంచి మొదలుకొని మార్చి 2021 వరకు ఇంగ్లండ్‌ వ్యాప్తంగా 53 ఇన్‌స్టిట్యూషన్స్‌లో, 83 హాస్పిటల్స్‌లో కరోనా కారణంగా  హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిన 2,320 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రముఖ శ్వాసకోశ సమస్యల వైద్య నిపుణుడు ప్రొఫెసర్‌ క్రిస్‌ బ్రిట్లింగ్‌ మాట్లాడుతూ ‘‘కొందరు ఐదు నెలలు గడిచాక కూడా పూర్తిగా కోలుకోకపోవడాన్ని మేం చూశాం.

అంతేకాదు... దాదాపు మూడింట రెండొంతుల మంది పూర్తిగా కోలుకున్నప్పటికీ...  మూడో వంతు మందిలో మాత్రం ఏడాది గడిచాక కూడా ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి. పైన పేర్కొన్న సమస్యలతో పాటు కొందరిలో కదలికలు మందగించడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, బ్రెయిన్‌ఫాగ్, యాంగ్జైటీ, డిప్రెషన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ)తోనూ బాధపడుతున్నారు. వారిలో చాలా తక్కువ మందిలో మాత్రమే వెంటనే సానుకూల మార్పులను చూడగలుగుతున్నాం. ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకపోయినా... లక్షణాలు పూర్తిగా తగ్గని వారిలో... ఇప్పటికి లభ్యమవుతున్న  ఫలితాల ప్రకారం... 25.5 శాతం మందిలో ఐదు నెలల తర్వాత 28.9 శాతం మందిలో ఏడాది తర్వాత లక్షణాలన్నీ పూర్తిగా తగ్గుపోతున్నా’’యని ఆయన తెలిపారు. ఇంకా తగ్గనివారు ఏమాత్రం ఆందోళన చెందకుండా... సంబంధిత సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటే చాలని భరోసా ఇస్తున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top