
దస్తూరి తిలకం
అంతా చేతిరాతలోనే ఉంది.. విషయ పరిజ్ఞానం నుంచి ఆరోగ్యం దాకా! మరి ఈ డిజిటల్ యుగంలో హ్యాండ్‌రైటింగ్ ప్రస్తావన? ఎలక్ట్రానిక్ వర్డ్స్‌తోనే అక్షరాభ్యాసం ప్రారంభించిన ఈ తరం హ్యాండ్ రైటింగ్‌కి అర్థాన్ని పర్‌ప్లెక్సిటీలో పరికిస్తుందేమో! ఆ పరిస్థితి రాకుండా పిల్లలు పెన్ను పట్టేలా చూడాల్సిన పని పెద్దలదే! దస్తూరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటీ? అసలా రాతకు ఎందుకంత ప్రాధాన్యమివ్వాలి అనే అంశాల మీద ప్రముఖ హ్యాండ్‌రైటింగ్ ఎనలిస్ట్ అండ్ గ్రాఫోథెరపిస్ట్, విశ్రాంత ఆచార్యులు (సెస్, హైదరాబాద్) డాక్టర్ సి. రామచంద్రయ్య ఏమంటున్నారో తెలుసుకుందాం...
చేతిరాతను మరచిపోతున్నామా? డిజిటల్ యుగంలో రాతకు కీ బోర్డ్ ప్రత్యామ్నాయమైంది. సెర్చింగ్ దగ్గర్నుంచి సందేశాలను చేరవేయడం దాకా అన్నిటికీ డిజిటల్ మాధ్యమమే! వ్యయప్రయాసల్లేని ఈ సౌకర్యం చెంతనుండగా చేతిరాతతో పనేముంటుంది? స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకూ టాబ్లెట్లు, లాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాక పరీక్షల్లో మాత్రమే చేతిరాత అవసరమవుతోంది. ఆన్‌లైన్ పరీక్షలకు అదీ అనవసరమే అయింది. మన వ్యక్తిత్వం, అలవాట్లు ముఖ్యంగా మైండ్ – బాడీ కోఆర్డినేషన్ (సమన్వయం)కి సంబంధించి చేతిరాత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.
ఎందుకంటే చేతిరాత అనేది నాడీ – కండరాల చర్య. మెదడు పంపే సందేశాలను బట్టే రాసే వేళ్లు కదులుతాయి. మరైతే ఒకే భాషలో ఒకే అంశాన్ని రాసేవాళ్లందరి చేతిరాత ఒకేరకంగా ఉండాలి కదా? అంటే ఏ ఇద్దరి చేతిరాత ఒకటిగా ఉండే అవకాశం లేదు. కారణం.. వాళ్ల సబ్‌కాన్షస్ మైండ్‌లోని ఆలోచన, సంఘర్షణలు. అందుకే చేతిరాతను మెదడు రాతగా అభివర్ణిస్తారు. మనిషి వయసుతోపాటు ఆలోచనలు, మానసిక స్థితిలో కలిగే మార్పులను బట్టి చేతిరాతా మారుతూంటుంది.
విద్య, వైద్యం.. నేరపరిశోధన, వైవాహిక బంధాలు
ఇలా చేతిరాతను విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. చేతితో రాసే, గీసే అంటే అక్షరాలు, అసంపూర్తి గీతలు– డూడుల్స్, బొమ్మలు, సంఖ్యలు వగైరా అన్నీ ఈ శాస్త్రం పరిధిలోకి వస్తాయి. వీటి ఆధారంగా మనిషి వ్యక్తిత్వాన్ని గుర్తించే ప్రక్రియ అనాదిగా పలు నాగరికతల్లో ఉంది. ఒక నిర్దిష్ట అంశంగా గ్రాఫాలజీకి నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రాఫాలజీ (graphology) మీద తొలిసారిగా 1622లో ఇటాలియన్ డాక్టర్, తత్వవేత్త కామిలో బాల్డి ఒక పుస్తకం రాశారు. చేతిరాతతో మనస్తత్వాన్ని విశ్లేషించడానికి లాటిన్ స్క్రిప్ట్‌నే సౌకర్యంగా భావిస్తారు.
గ్రాఫాలజీ ఒక అకడమిక్ సబ్టెక్ట్‌గా ప్రవర్తనా శాస్త్రం కోవలోకి వస్తుంది. ఇది ఎక్కువగా మనస్తత్వశాస్త్రం, నాడీమండల శాస్త్ర విశ్లేషణలను గ్రహిస్తుంది. యూరప్, అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో గ్రాఫాలజీ కోర్సులున్నాయి. గ్రాఫాలజీ సంఘాలూ ఉన్నాయి. ఈ సబ్టెక్ట్‌ను సూడోసైన్స్ అని విమర్శించేవాళ్లూ లేక΄ోలేరు. అయినా రోజురోజుకూ దీని ప్రాముఖ్యం పెరుగుతూనే ఉంది. అమెరికాతో పాటు మన దగ్గరా పెద్ద పెద్ద కంపెనీలు కొన్నిరకాల పదవులకు అభ్యర్థుల చేతిరాతనూ పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. సంబంధిత రంగంలో అభ్యర్థికి పూర్వ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని లక్షణాలను బేరీజు వేయడం కోసం అలా చేతిరాతనూ పరిగణిస్తున్నారు. ఇంకా విద్య, వైద్యం, వ్యాపారం, నేరపరిశోధన, వైవాహికబంధాలు వంటి విషయాల్లోనూ చేతిరాతను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఆరోగ్య రాత..
వివిధరకాల వ్యక్తిత్వ లక్షణాలతో పాటు మెదడులో ఉద్భవించి నెమ్మదిగా భౌతికంగా వ్యక్తమయ్యే కొన్నిరకాల ఆరోగ్యసమస్యలనూ చేతిరాతతో గుర్తించవచ్చు. ఉదాహరణకు.. ఆత్మవిశ్వాసం/ఆత్మన్యూనత, అభద్రత, చికాకుపడటం, మొండితనం, సేవాతత్పరత, పట్టుదల, భావాలను వ్యక్తీకరించలేక΄ోవడం, ఏకాగ్రత లోపం, గతం గురించిన ఆందోళన, ఆధిపత్య ధోరణి, ఎవరో ఏదో అనుకుంటారని చేయాల్సిన పనులు చేయలేక΄ోవడం, ఆరోగ్య సమస్యలైన బీపీ, థైరాయిడ్, మైగ్రైన్, ప్రొస్టేట్, శ్వాసకోశ ఇబ్బందులు వగైరా దాదాపు వందకు పైగా లక్షణాలను చేతిరాతతో గుర్తించవచ్చు.
గ్రాఫోథెరపీ..
గ్రాఫాలజీ ద్వారా గుర్తించిన సమస్యలను గ్రాఫోథెరపీతో నెమ్మదిగా సరిచేసుకోవచ్చు. ఈ థెరపీ రాసే వేలును ఒక పద్ధతి ప్రకారం కదిలించడం ద్వారా నాడీ సంకేతాలను మెదడుకు పంపి తద్వారా ఉపచేతన మనస్సును ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ సర్వరోగ నివారణి కాదు. అలాగని వైద్యచికిత్సకు ప్రత్యామ్నాయమూ కాదు. చేయించుకుంటున్న చికిత్సకు ఒక సపోర్ట్‌గా మాత్రమే ఈ గ్రాఫోథెరపీ (graphotherapy) పనిచేస్తుంది. ఆధునిక జీవనశైలి సైడ్ ఎఫెక్ట్స్ అయిన మానసిక ఒత్తిడి, ఆందోళనలు నెమ్మదిగా అనేక శారీరక సమస్యలుగా మారుతాయి.
ఉదాహరణకు హైపర్‌టెన్షన్, థైరాయిడ్, మైగ్రేన్, నిద్రలేమి, ప్రిడయాబెటిక్ మొదలైనవి. కాగితం మీద రాయడం ద్వారా మన ఆలోచనలకు ఒక స్థిరత్వం వస్తుంది. మనసు నెమ్మదిస్తుంది. గ్రాఫోథెరపీ ‘నాడీ మార్పిడి’ అనే సూత్రీకరణపై పనిచేస్తుంది. అంటే మెదడుకున్న సామర్థ్యం – కొత్తనాడీ మార్గాలను ఏర్పరచుకునే, పాతవాటిని మార్చుకునే వాటిపై ఆధారపడింది కాబట్టి చేతిరాత (Hand Writing) అనేది కేవలం కాగితం, కలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది మెదడుకు సంబంధించిన, స్వస్థత కలిగించే ప్రక్రియ.
పిల్లలకు.. చేతిరాత విషయంలో పిల్లలకు సంబంధించి పరిశీలిస్తే.. పిల్లల మెదడు బాల్యదశలో పరిణతి క్రమంలో ఉంటుంది కాబట్టి పదహారేళ్లు నిండేవరకు వాళ్ల చేతిరాతను విశ్లేషించరు. కానీ పిల్లలు ఒకవేళ అభద్రతకు, డిప్రెషన్‌కు గురవుతున్నా, తమలో తాము చిరాకు పడుతున్నా చేతిరాతతో గుర్తించవచ్చు. వాళ్ల చేతిరాతను శాస్త్రీయబద్ధంగా మలచడం ద్వారా ఆ సమస్యలనూ అధిగమించవచ్చు. స్వీడన్‌లో 2009లో స్కూళ్లలో పెద్ద ఎత్తున డిజిటలైజేషన్‌ను ప్రవేశపెట్టింది. పుస్తకాల్లో చదవడం, రాయడం చాలావరకు తగ్గిపోయాయి. దానివల్ల జరిగిన నష్టాన్ని పదిహేనేళ్ల తర్వాత కానీ గుర్తించలేకపోయారు. పుస్తకాలను, చేతిరాతను తిరిగి ప్రవేశపెట్టాలని ఇటీవలే నిర్ణయించారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో పలుపద్ధతుల్లో రాయిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అక్షరాలను కలిపి రాయడమే ఉత్తమమైనది. కలిపి రాయడం వలన మెదడులోని వివిధ భాగాలు ప్రేరేపితమవుతాయని, నేర్చుకోవడానికి ఈ ప్రక్రియ చాలా ఉపయుక్తమైనదని, టైపింగ్‌లో అలాంటి ప్రేరణ జరగలేదని తేలింది. నార్వే యూనివర్సిటీ 2020లో పన్నెండేళ్లు నిండిన పిల్లలపై ఈ అధ్యయనం చేసింది. స్వీడన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లలో చేతిరాతను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాలకు ఆ అధ్యయనం తోడ్పడింది.
మాడ్యూల్..
చేతిరాతలో.. లెటర్ ఫార్మేషన్, కనెక్టివిటీ, జోనింగ్, స్పేసింగ్, వేగం.. అనే అయిదు ప్రధానాంశాలుండాలి. గ్రాఫోథెరపిస్ట్ (graphotherapist) పర్యవేక్షణలో ఒక క్రమపద్ధతిలో వీటిని నేర్చుకునేందుకు గ్లోబల్ పెన్మాన్షిప్ అకాడమీలో పిల్లల కోసం ఒక మాడ్యూల్‌ను రూపొందించింది. ఈ డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి వీలున్న ఒకే ఒక మార్గం చేతిరాత. అందుకే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.