రతన్‌బాయి- జిన్నా.. చిత్రమైన ప్రేమగాథ, విచిత్ర వివాహం

Goparaju Narayana Rao Article On Rattanbai - Sakshi

కాలరేఖలు

దేశ విభజన.. దేహ విభజనే!

దేశ విభజన, దేహ విభజన వేర్వేరు కావు. పోలండ్, జర్మనీ, వియత్నాం, కొరియా, యెమెన్‌ వంటి దేశాలు విడిపోయాయి. కొన్ని మళ్లీ ఏకమైనాయి. ఏ దేశ విభజనైనా విషాదాంతమే. ఫలశ్రుతి ఒక్కటే. జీవితాలు ఛిన్నాభిన్నం. అనుబంధాల నిలువుకోత. వలసలు, తరిమివేయడం, రక్తపాతం.. 1947 నాటి భారత విభజనలోనూ అదే పునరావృతమైంది. దేశ/దేహ విభజన ఒకటేనంటూ గుండెను చీల్చుకు వచ్చిన అనుభవం ఆ విభజన కారకుడిగా చరిత్ర బోనులో నిలబడిన మహమ్మద్‌ అలీ జిన్నాకే ఎదురైంది. 

1947 ఆగస్ట్‌ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్‌లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లాడు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట ఇత్తడి రెయిలింగ్‌ మధ్య ఉన్న నాలుగు అడుగుల ఎత్తు, ఆరడుగుల పొడువు ఉన్న పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచాడు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు రతన్‌బాయి మహమ్మద్‌ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929) పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టాడు. 

రతన్‌బాయి పెటిట్‌ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ జిన్నా భార్యే. ఆ ఇద్దరిదీ ఒక విచిత్ర వివాహం. చిత్రమైన ప్రేమగాథ. బొంబాయి కోటీశ్వరులలో ఒకడైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్‌ల ముద్దుల పట్టి రూతీ. నూలు మిల్లులను బొంబాయికి తెచ్చిన పార్సీ కుటుంబం. దిన్షా పెటిట్, జిన్నా ఆప్తమిత్రులు. పెటిట్‌ కేసులను వాదించే న్యాయవాదుల బృందంలో జిన్నా ఒకడు. పెటిట్‌ సన్నిహితుడు, కాంగ్రెస్‌ ప్రముఖుడు ఫిరోజ్‌షా మెహతా.. జిన్నాకూ ఆప్తుడే.

అలా పెటిట్‌ కుటుంబీకులకూ సన్నిహితుడయ్యాడు జిన్నా. 1916 సంవత్సరంలో తమ కుటుంబంతో పాటు డార్జిలింగ్‌ వచ్చి అక్కడి తమ వేసవి విడిదిలో అతిథిగా ఉండవలసిందని జిన్నాను కోరాడు దిన్షా. నిజానికి ఏటా వేసవికి ఫ్రాన్స్‌లో గడపి వస్తుంది ఆ కుటుంబం. ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు డార్జిలింగ్‌ను ఎంచుకున్నారు. ఆ ప్రయాణం జిన్నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘రూతీ జిన్నా: ది స్టోరీ, టోల్డ్‌ అండ్‌ అన్‌టోల్డ్‌’ (ఖ్వాజా రజా హైదర్‌), ‘రోజెస్‌ ఇన్‌ డిసెంబర్‌’ (ఎంసీ చాగ్లా), ‘ఫ్రీడవ్‌ు ఎట్‌ మిడ్‌నైట్‌’ (ల్యారీ కోలిన్స్, డొమినీక్‌ లాపీరె) పుస్తకాలు ఈ ఘట్టాలను నమోదు చేశాయి. 

పెటిట్‌ కుమార్తె ..‘ఫ్లవర్‌ ఆఫ్‌ బాంబే’గా పేర్గాంచిన అందాలరాశి, పదహారేళ్ల రతన్‌బాయి జిన్నా ప్రేమలో పడింది. అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. ఆమె తండ్రి వయసూ దాదాపు అంతే. అంతదాకా జిన్నాకు పెళ్లి కాలేదా? అయింది. 1893లో జిన్నాను చదువు కోసం లండన్‌ పంపించే ముందు అతడి తల్లి ముందుజాగ్రత్తగా ఎమీ బాయి అనే దగ్గర బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కానీ అతడు తిరిగి దేశం వచ్చే సరికి ఎప్పుడూ చూడనీ, మాట్లాడనీ భార్య, తల్లి కూడా ప్లేగుతో చనిపోయారు. మళ్లీ వివాహం చేసుకోలేదు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే.

కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్‌ అయ్యాడు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యాడు. 1910 నాటికే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్‌ తిలక్‌కూ, అనిబీసెంట్‌కూ, మదన్‌మోహన్‌ మాలవీయకూ సన్నిహితుడు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువ చేశాయి. అందులో మొదటిది సాహిత్యం. 

డార్జిలింగ్‌ తేయాకు తోటలలో, జలపాతాల దగ్గర, బౌద్ధారామాలలో అంకురించిన ఆ ప్రేమను సమాజం అంగీకరిస్తేనే వింత తప్ప, అంగీకరించపోతే వింతేకాదు. ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్‌ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చాడు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్‌ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి వచ్చేసింది కట్టుబట్టలతో, తన కుక్కపిల్లతో. 1918 ఏప్రిల్‌ 18న ఆమె మతం మార్చి (రూతీ ‘మరియం’ అయింది), మరునాడు ఆ ఇంటిలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ‘జే’ అంటూ జిన్నాను ఆప్యాయంగా పిలిచేదామె. గాఢంగా ప్రేమించింది. ప్రేమయాత్ర కోసం కశ్మీర్‌ వెళ్లారు.  దాల్‌ సరస్సులో రూ. 50,000తో బోట్‌హౌస్‌కు అలంకారాలు చేయించిందామె. కాంగ్రెస్‌లో జిన్నా మితవాది. గోఖలే సలహాతో ముస్లింలీగ్‌లో చేరాడు.

జిన్నాలోని మితభాషిని క్షమించింది గానీ, ఇంగ్లిష్‌ పాలనను ఆరాధించే మితవాదిగా, ముస్లింలీగ్‌ నేతగా మాత్రం సహించలేక పోయిందనిపిస్తుందామె. ‘జిన్నా ‘‘సర్‌ జిన్నా’’ అయితే, నేను వేరుగా ఉండడానికే ఇష్టపడతాన’ని చెప్పింది. అత్యాధునికంగా ముస్తాబై జిన్నాతో వెళుతుంటే లీగ్‌ సభ్యులు మండిపడేవారు. దేనికీ జిన్నా ఆమెను వారించలేదు. బ్రిటిష్‌ జాతంటే ఆమెకు ద్వేషం. వైస్రాయ్‌ లార్డ్‌ రీడింగ్‌కే కళ్లు బైర్లు కమ్మే సమాధానమిచ్చింది. ఢిల్లీలో వైస్రాయ్‌ ఇచ్చిన విందుకు జిన్నాతో పాటే వెళ్లింది. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ‘నేను జర్మనీ వెళ్లాలి. కానీ వెళ్లలేను’ అన్నాడు రీడింగ్‌. ‘ఎందుకు?’ అనడిగింది రూతీ.‘వాళ్లకి బ్రిటిషర్లంటే పరమ ద్వేషం!’ అన్నాడు.

‘అయితే ఇక్కడికి మాత్రం ఎందుకొచ్చారు?’ అన్నదామె. జిన్నా, గాంధీ విభేదాలు తారస్థాయికి చేరినప్పుడు కూడా రూతీ నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ సదస్సుకు వెళ్లింది. అంతకు ముందే 1919 ఆగస్ట్‌ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్‌ రాజకీయాలలో తలమునకలైపోయాడు. సంస్థ  కేంద్రం ఢిల్లీకి మారింది. రూతీ వెళ్లలేదు. జిన్నా, అతడి అవివాహిత సోదరి ఫాతిమాల మీద నిరసనతో రూతీ మలబార్‌హిల్స్‌ నివాసం వదిలి తాజ్‌ హోటల్‌కు మకాం మార్చింది.

అప్పటికే ఆమెకు పేగు క్యాన్సర్‌. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆ హోటల్‌లోనే అనంతమైన దిగులుతో కన్నుమూసింది. అమ్మమ్మ అండతో దీనా పార్సీ మతస్థుడు నెవిల్లే వాడియాను జిన్నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు నుస్లీ, డయానా. డయానా రెండు కాళ్లకూ పోలియో. తరువాత ఆ భార్యభర్తలు విడిపోయారు. నెవిల్లే విదేశాలలో. దీనా పిల్లలతో బొంబాయిలో. తనతో పాకిస్తాన్‌ వచ్చేయమని కూతురిని ఆర్తితోనే అడిగాడు జిన్నా. ఒక లేఖ రాసి ఆ ఇద్దరు పిల్లలతోనే తాతయ్యకి పంపింది దీనా. ‘నాన్నా! మీ ప్రయాణం సుఖంగా సాగాలి. మీరు సాధించుకున్న పాకిస్తాన్‌ సౌభాగ్యంతో వర్ధిల్లాలి. సదా మీ ఆశీస్సులు కోరుతూ, దీనా.’ అంతే.

ఆగస్ట్‌ 7న బొంబాయిలోనే విమానం ఎక్కాక  వెనక్కి తిరిగి 51 ఏళ్ల అనుబంధమున్న బొంబాయిని కంటి నిండుగా చూసుకున్నాడు జిన్నా. పాకిస్తాన్‌ వెళ్లాక ఇక్కడున్న తన రూతీ సమాధిని చూసే అవకాశం, జ్ఞాపకంగా ఎప్పుడైనా ఓ గులాబీనుంచే సందర్భం వస్తాయా? ప్రతి ఆగస్ట్‌ 14న పాకిస్తాన్‌ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్‌ 11న, పాకిస్తాన్‌ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్‌ జిన్నా చనిపోయాడు.  
-డా. గోపరాజు నారాయణరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top