మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష | Gopal Shetye, an innocent man, was wrongly convicted | Sakshi
Sakshi News home page

మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష! చివరిక అతడు..

May 10 2026 10:54 AM | Updated on May 11 2026 9:31 AM

Gopal Shetye, an innocent man, was wrongly convicted

పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి   దూరం చేసింది. 

‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే  కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.  

కేసు నమోదు..శిక్ష ఖరారు
మహారాష్ట్రలోని ఘట్‌కోపర్‌ రైల్వే స్టేషన్‌ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని  పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారించారు. కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని  2010లో తుది తీర్పు వెలువరించారు.

నిర్దోషి అని తేలింది.. కానీ
బాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్‌ చేసింది గోపాల్‌ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్‌ పేర్కొన్నాడు. ట్రయల్‌ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. 

అది పెండింగ్‌లో ఉండగా, బెయిల్‌ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్‌ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్‌ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌’ కింద ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. 

పరిహారం కోసం పోరాటం
‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 

ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. 

పిటిషనర్‌ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్‌పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. 

కోర్టు తీర్పు ఇలా..
తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్‌ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి  కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్‌ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. 

ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్‌ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. 

పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్‌కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. 

దిలీప్‌ మాదిరెడ్డి

(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!)

 

(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement