మాయమైన హారం | Funday Crime Stroy | Sakshi
Sakshi News home page

మాయమైన హారం

May 3 2026 9:32 AM | Updated on May 3 2026 9:38 AM

Funday Crime Stroy

పెళ్లి పందిరంతా పూల వాసనలు, బాజాభజంత్రీలతో సందడిగా ఉంది. కానీ పెళ్లి కూతురు దివ్య ముఖంలో మాత్రం కళ లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు మదన్‌ ప్రవర్తన ఏదో తేడాగా ఉందని తన స్నేహితురాలు, లేడీ డిటెక్టివ్‌ సుగాత్రికి ముందే చెప్పింది.‘కట్నం అక్కర్లేదు. అబ్బాయికి పెద్ద బిజినెస్‌ వుంది. అందగాడు’... మధ్యతరగతి తండ్రి ఆలోచన... అందుకే కూతురిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు.

పెళ్లి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం మొదలైంది.పెళ్ళికి వచ్చిన కనకం మెడలోని కోటి రూపాయల విలువైన వజ్రాలహారం మాయమైంది.  పెళ్లి పెద్దలు కంగారు పడుతుంటే, సుగాత్రి లోపలికి అడుగు పెట్టింది.దివ్య తండ్రిలో ఆందోళన. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ అపశకునం ఏమిటని...?పోలీసులు పెళ్లి మండపాన్ని చుట్టుముట్టారు. అన్ని గదులూ వెతికారు.పెళ్ళికొడుకు రూమ్‌ మిగిలి వుంది. దివ్య తండ్రి అడ్డు చెప్పబోయాడు. ‘కాబోయే అల్లుడిని సోదా చేస్తే  బాగుండద’ని...సుగాత్రి నచ్చచెప్పింది. పెళ్ళికొడుకు గది సోదా చేస్తే తను క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తాడని చెప్పింది.మదన్‌ రూమ్‌ అణువణువూ వెతికారు. ఎక్కడా హారం దొరకలేదు.పెళ్ళికొడుకు మదన్‌ సీరియస్‌ అయ్యాడు. 

‘అసలు హారం పోయిందో నాటకం ఆడుతున్నారో’ అంటూ అరిచాడు.‘‘నిజమే హారం పోలేదు కానీ, దొంగ దొరికాడు.’’  అంది సుగాత్రి.  ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మదన్‌.‘‘హారం పోతే రికవరీ చేసుకోవచ్చు.. కానీ జీవితం పోతేనో?’’... అంటూ సుగాత్రి మదన్‌ సూట్‌కేస్‌ తెరిచి, అందులో ఉన్న రహస్య అరను పగులగొట్టింది. అందులో వేర్వేరు దేశాల పాస్‌పోర్టులు, వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు బయటపడ్డాయి.‘‘ఇప్పుడేమంటావ్‌ మిస్టర్‌ ఇంటర్నేషనల్‌ ఫ్రాడ్‌ మదన్‌?’’ అంటూ పెళ్లికి వచ్చిన అందరి వైపు, దివ్య తండ్రి వైపు చూసి, ‘‘ఇతడు అంతర్జాతీయ స్థాయిలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే మ్యారేజ్‌ ఫ్రాడ్‌. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలాగే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిలను అమ్మేసి పరారయ్యాడు. 

చాలా చోట్ల ఇతని మీద కేసులు వున్నాయి. మధ్యతరగతి అమ్మాయిలే ఇతడి టార్గెట్‌. కూతురు పెళ్ళైతే చాలు, అనుకునే మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతలను, ఆశలను క్యాష్‌ చేసుకునే ఘరానా మోసగాడు ఇతను. నిజానికి హారం పోలేదు. కానిస్టేబుల్‌ కనకంతో నేను ఆడించిన  నాటకం.దివ్య పెళ్ళికొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మదన్‌ ఫోటోను డేటాబేస్‌లో చెక్‌ చేశాను. ఇతని నేరాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో మోసాలు చేస్తాడు.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్‌ సుగాత్రి.మదన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

‘‘నాలాంటి మధ్య తరగతి తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు తల్లీ! బిడ్డ పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి’... చేతులు జోడించి చెప్పాడు దివ్య తండ్రి.‘‘థాంక్యూ మై ఫ్రెండ్‌ లేని హారాన్ని పోయిందని చెప్పి ఆధారాలు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్తుడిని పట్టుకుని... నా జీవితాన్ని  నాలాంటి అమ్మాయిల జీవితాలను కాపాడావు’’ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది దివ్య.‘‘మ్యాట్రిమోనీలలో సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవాలి. అబ్బాయిల ఆస్తిపాస్తులు, అర్హతల కన్నా వ్యక్తిత్వం, అసలు స్వరూపం తెలుసుకోవాలి.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్‌ సుగాత్రి.


 

Advertisement
 
Advertisement
Advertisement