
చాక్లెట్ రైస్ కేక్
కావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా ఉడికించకూడదు)
కొబ్బరికోరు– 2 టేబుల్ స్పూన్లు
అరటిపండు గుజ్జు– 4 టేబుల్ స్పూన్లు
కొబ్బరి పాలు– పావు లీటరు
పంచదార– ఒక కప్పు
నెయ్యి– 1 లేదా 2 టీ స్పూన్లు
దాల్చినచెక్క పొడి, చాక్లెట్ క్రీమ్, పీనట్ బటర్– గార్నిష్ కోసం
తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి, కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అనంతరం నచ్చిన షేప్‌లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, ఈ రైస్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాంతరంగా చేత్తో ఒత్తుకుని, గట్టిపడేలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో రైస్ కేక్ మీద పీనట్ బటర్ పూసి, పైన దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఆపైన చాక్లెట్ క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని, క్రీమ్ ఆరిన తర్వాత, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.
అమెరికా హలపేన్యో పాపర్స్
కావలసినవి: హలపేన్యో (పెద్ద పచ్చిమిర్చీలు)– 10 (సగానికి నిలువుగా కట్ చేసి, విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి)
చీజ్ క్రీమ్– 200 గ్రాములు
మాంసం ముక్కలు– పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం జోడించి, నూనెలో దోరగా వేయించాలి), వెల్లుల్లి– 3 (తురుములా చేసుకోవాలి), ఉప్పు, మిరియాలు, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పర్మేసన్ చీజ్ తురుము– కొద్దికొద్దిగా
బ్రెడ్ పౌడర్– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకోవాలి)
తయారీ: ముందుగా ఒక పాత్రలో చీజ్ క్రీమ్, వెల్లుల్లి తురుము, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలు, వెల్లుల్లి మిశ్రమాన్ని హలపేన్యో ముక్కల్లో నింపుకోవాలి.
ఇప్పుడు ప్రతి హలపేన్యో ముక్కపైన కొద్దికొద్దిగా పర్మేసన్ చీజ్ తురుము వేసుకోవాలి. ఆపైన వేయించిన బ్రెడ్ పౌడర్ పరచుకుని, ఆ హలపేన్యో ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ట్రేను ఓవెన్‌లో పెట్టుకుని, వాటిని బేక్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.
ఫరాలీ సూరన్ ఖిచిడీ
కావలసినవి: కంద తురుము– 2 కప్పులు
సగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు– ఒక కప్పు (కడిగి, నీళ్లు పోయేలా వడకట్టులో వేసి పెట్టుకోవాలి)
నెయ్యి– సరిపడా
వేరుశెనగలు– ఒక కప్పు (దోరగా వేయించి పొడి చేసుకోవాలి)
పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము– కొద్దికొద్దిగా
కరివేపాకు, జీలకర్ర– తాలింపు కోసం
నిమ్మరసం– సరిపడా
ఉప్పు– తగినంత
తయారీ: ముందుగా ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసుకుని, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కంద తురుము వేసి, మూతపెట్టి చిన్నమంట మీద బాగా మగ్గనివ్వాలి. దానిలో కొద్దిగా నీళ్లు, వేరుశెనగ పొడి, సగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు కలుపుకోవాలి.
రుచికి సరిపడా ఉప్పు వేసి, మధ్యమధ్యలో గరిటెతో తప్పితూ మూతపెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరగా, ఒక ప్లేట్‌లోకి తీసుకుని, పైన తగినంత నిమ్మరసం, కొత్తిమీర తురుము, కొబ్బరికోరు వంటివి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఖిచిడీ.
(చదవండి: బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!)