కిడ్స్ టైమ్
చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగ్‌లలో ఖరీదైన కాస్మెటిక్స్‌ని క్యారీ చేస్తున్నారు. వీరినే నిపుణులు ‘సెఫోరా కిడ్స్’గా పిలుస్తున్నారు.
స్కిన్ కేర్ అవసరమా?
కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010–2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సీరమ్‌లను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్‌ని అవకాశంగా మలచుకుంటోంది కాస్మెటిక్స్ రంగం.
అసలు ఈ బేబీ–ఫేస్ బ్యూటీ ధోరణి గత ఏడాది ఒక కంపెనీ పసిబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను తీసుకురావడంతో మొదలైంది. మూడేళ్ల పిల్లల నుంచి వాడవచ్చునంటూ పలు రకాల ఫేస్ మాస్క్‌లను తను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ బ్యూటీ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులకు స్కిన్ కేర్ అవసరమా అంటూ ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసింది.
సోషల్ మీడియా వేదికగా!
కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం కూడా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణాల మధ్యలో పిల్లలను ఆకర్షించేలా అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్‌కి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తులను ఎలా వాడాలో చూపిస్తున్నారు.
ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించగానే అధునాతన ఆల్గారిథమ్‌లు వారికి మరిన్ని బ్యూటీ టిప్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల వీడియోలను చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లలను ఆ అలవాట్లను అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి రూ. 380 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
కాస్మెటి కోరెక్సియా
సౌందర్య ఉత్పత్తులు పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే, రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని తెలియకుండానే పంపిస్తాయి. డిజిటల్ ప్రపంచంలో పదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇతర పిల్లలను చూసి ప్రభావితమవుతున్నారు. దీనివల్ల కాస్మెటికోరెక్సియా అనే కొత్త మానసిక సమస్య పుట్టుకొచ్చింది. అంటే సౌందర్య ఉత్పత్తులు, చర్మ సంరక్షణ పట్ల అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడం. ఇలాంటి పద్ధతులకు చిన్నప్పుడే అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరుగుతాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు.
గుడ్డిగా నమ్మొద్దు
పసిబిడ్డలకు ΄ పౌష్టికాహారం, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని సూచిస్తున్నారు స్కిన్‌కేర్ నిపుణులు. స్కిన్ కేర్ ట్రెండ్‌లను గుడ్డిగా అనుసరించకూడదంటున్నారు. సౌందర్య సాధనాల పరంగా పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు. ఫేస్ మాస్క్‌లు, స్క్రబ్‌లు, షీట్ మాస్క్‌ల వంటి బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేయడం వారి వయస్సుకి తగినది కాదని చెబుతున్నారు.
అనవసరమైన ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, అలర్జీలు, దద్దుర్లు లేదా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చనంటున్నారు. రంగురంగుల ΄్యాకేజింగ్, సోషల్ మీడియా ఆల్గారిథమ్‌ల వెనుక, పిల్లలు కోలుకోలేని శారీరక చర్మసమస్యలు, కాస్మెటికోరెక్సియా వంటి తీవ్రమైన మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయి. అందుకే అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహంలో చిక్కుకోకుండా పిల్లలను కాపాడుకోవాలి. అందంపై ఉండే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కాస్మెటిక్స్‌కి దూరంగా ఉంచాలి.
పిల్లలకు కాస్మొటిక్స్ వాడకూడదు...
చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారు. తర్వాత కలర్ తగ్గిందేమిటి అనుకుంటారు. దీంతో స్కిన్ కేర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చుండ్రు వస్తుందని, స్మెల్ బాగుంటుందని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మేకప్ కోసం ఇతర ప్రొడక్ట్స్ వాడే వారుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సౌందర్య ఉత్పాదనలను ఉపయోగించకూడదు. రంగు తక్కువ ఉన్నారనో, ఇంకా బాగా కనిపిస్తారనో ఆలోచనతో వివిధ రకాల సబ్బులు, కాస్మొటిక్స్ ఉపయోగిస్తే వారి లేత చర్మంపైన దద్దుర్లు రావడం, ఇరిటేషన్ కలగడం.. వంటివి సంభవించవచ్చు. ఆరుబయట బాగా ఆడే పిల్లలకు మినరల్ బేస్డ్ సన్‌స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి.
డా. స్వప్నప్రియ
సీనియర్ డర్మటాలజిస్ట్
– జంబుల రమాదేవి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి


