
ఆ ఇంట్లో ఏమూల చూసినా గణనాధుల ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. విభిన్న రకాల వినాయక విగ్రహాలతో ఆ ఇల్లే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆధ్యాతి్మక సౌరభంతో విరాజిల్లుతుంటాయి. ఆయన తన 12వ ఏట నుంచే అరుదైన సేకరణపై దృష్టిపెట్టారు. అదే వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పుస్తకాలు, ఫొటోలు సేకరించడం. ఈ హాబీ ఆయనకు చిన్ననాటి నుంచే అబ్బగా ఇప్పటికీ కొనసాగుతోంది.
ప్రత్యేకత కలిగిన విగ్రహాలు కనిపిస్తే చాలు.. అది ఏ దేశంలో ఉన్నా తన గణపతి మ్యూజియంలోకి చేరాల్సిందే. అంతేకాదు.. విశ్వవినాయక్ పేరుతో వినాయక ఆలయాలపై పుస్తకం కూడా రాస్తున్నారు. ఆయనే వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన పబ్‌శెట్టి శేఖర్. ఎస్‌బీఐలో పనిచేసిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన హాబీని కొనసాగిస్తున్నారు.
అమెరికా, చైనా, నేపాల్, జపాన్, అఫ్గానిస్థాన్, ఈజిప్ట్, శ్రీలంక, బాలి, జర్మనీ, టిబెట్, కంబోడియా, థాయ్‌లాండ్, యూకే ఇలా సుమారు 39 దేశాల నుంచి పలు ప్రత్యేకతలు కలిగిన గణేశ విగ్రహాలను సేకరించారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, అల్యూమినియం, మార్బుల్, క్రిస్టల్, చెక్క, రాతి, పంచలోహం, మట్టితో తయారుచేసిన విగ్రహాలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని తలపించే సేకరణ ఇక్కడ కొలువుదీరింది.
వీటి 32 రూపాల గణేశుడి నుంచి 12 రాశుల గణపతి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక గణపతి విగ్రహాలు సేకరించిన వ్యక్తిగా పబ్‌శెట్టి శేఖర్ గిన్నిస్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు.
21,708 గణేశ విగ్రహాలు..
పబ్‌శెట్టి శేఖర్ ఇప్పటివరకూ తన హాబీలో భాగంగా 21,708 గణేశుడి విగ్రహాలను సేకరించి రికార్డు సృష్టించారు. అంతేకాదు, 19,708 గణేశ పోస్ట్‌కార్డులు తయారు చేశారు. 15,582 గణేశ ఫొటోలూ ఉన్నాయి. 1,105 గణేశ పోస్టర్లు, 260 గణేశ పురాణాలు, పుస్తకాలు సేకరించారు. 250 గణేశ కీచైన్లు అబ్బురపరుస్తున్నాయి. అరుదైన 205 ఆడియో, వీడియో క్యాసెట్లు సేకరించారు. ఇప్పటి వరకూ ఆయన సేకరించినవన్నీ కలుపుకుని 58,498. ఈ ఒక్క ఏడాదిలోనే 2,060 గణేశ విగ్రహాలను సేకరించి తన హాబీకి మరింత వన్నె తెచ్చాడు. 1973లో ప్రారంభమైన ఈ హాబీ రోజురోజుకూ ముందుకెళ్లడమే కానీ, వెనక్కి తగ్గడం లేదు.
లక్ష సేకరించడమే లక్ష్యం..
బొజ్జ గణపయ్యకు సంబంధించి వివిధ రూపాల్లో ఇప్పటివరకూ 50వేలకు పైగా సేకరించారు. మొత్తం లక్ష సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్‌శెట్టి శేఖర్ చెబుతున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ముందుగా చూసేది వినాయక విగ్రహాలేనని, తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటానని, ఇప్పటివరకూ 15 వరల్డ్ రికార్డులు రాగా, 2014, 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించానని తెలిపారు.
నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్, మిరాకిల్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు, కింగ్స్ వరల్డ్ రికార్డు ఇలా ఎన్నో రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ హాబీ తన ప్రాణం ఉన్నంత వరకూ కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు గణపతి దేవాలయాలపై రీసెర్చ్ చేస్తున్నట్లు వివరించారు.
(చదవండి: చవితి రుచులు చవిచూడాల్సిందే!)