మిర్చి రైతుకు గుడ్‌న్యూస్‌.. మందు ఉంది! అయితే...

Chilli Farming: How To Control Thrips Thamara Purugu Homeo Remedies - Sakshi

నల్ల పేనుకు హోమియోతో చెక్‌!

జర్మనీకి చెందిన డాక్టర్‌ శామ్యూల్‌ హనెమన్‌ అనే వైద్య పరిశోధకుడు రెండు వందల ఏళ్ల క్రితం శాస్త్రీయమైన హోమియో వైద్య విధానాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యం విస్తరించింది. మన దేశంలో కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్య విధానం హోమియో. మనుషుల వ్యాధులకే కాదు, పశువ్యాధులకు, పంటలు, తోటల్లో చీడపీడలకు సైతం హోమియో మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయ రంగాల్లో కృషి చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం మిరపతో పాటు అనేక పంటలను పట్టిపీడిస్తున్న వెస్ట్రన్‌ త్రిప్స్‌ లేదా నల్ల పేను లేదా మిన్నల్లి లేదా పూతను ఆశించే తామరపురుగు సమస్యకు కూడా హోమియో మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు, రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సంతోషంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలువురు రైతులు హోమియో మందులు వాడి కొత్త రకం తామరపురుగు బెడద నుంచి మిరప తోటలను కాపాడుకున్నారని ఆయన తెలిపారు. 

పూత, పిందెలను ఆశించి రసంపీల్చి పంట దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసే  నల్ల పేనుకు ఎకరానికి వేలాది రూపాయలు ఖర్చు చేసి పురుగుమందులు వాడినా ఫలితం కనిపించక తీవ్రనిరాశలో ఉన్న రైతులకు హోమియోపతి మందులు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పంటలకు హోమియో మందులను వాడి సత్ఫలితాలు రాబట్టడంలో అనుభవం గడించిన జిట్టా బాల్‌రెడ్డి వివిధ పంటలపై వచ్చే ఏయే చీడపీడలకు ఏయే మందులను, ఏయే మోతాదుల్లో, ఏ విధంగా పిచికారీ చేయాలో  శాస్త్రీయంగా వివరిస్తున్నారు. వేలాది మంది రైతులకు విషయాలు ఎప్పటికప్పుడు బోధపరిచే లక్ష్యంతో ‘అమేయ కృషి వికాస కేంద్రం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను సైతం బాల్‌రెడ్డి ప్రారంభించటం విశేషం. 
– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి 

మందు మోతాదు మించితే ప్రతికూల ఫలితాలు 
ద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు బాల్‌రెడ్డి ప్రత్యేక పద్ధతిని సూచిస్తున్నారు. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి,  సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎంఎల్‌ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలకొట్టినట్టు వేగంగా ఉపాలి. ఆ తర్వాత ఆ సీసాలోని మిశ్రమాన్ని 20 లీటర్ల థైవాన్‌  స్పేయర్‌ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి.

పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్‌. కంటె ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదని, మోతాదు మించితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చని బాల్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా,  2,3 హోమియో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి పిచికారీ చేయకూడదన్నారు. 
స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయన్నారు. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్ప్రేయర్‌ను, బాటిళ్లను శుభ్రంగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయన్నారు. 

వీలుంటే హోమియో మందు పిచికారీకి ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్‌ను వాడుకుంటే మంచింది. సూచించిన మందును ఒక్కసారి పిచికారీ చేస్తే చాలని, రైతు పంటను గమనించుకొని పిచికారీ చేసుకోవాలని బాల్‌రెడ్డి అన్నారు. 

30 పొటెన్సీకి మించి వాడొద్దు
ద్రవ రూప హోమియో మందులు సాధారణంగా పట్టణాలు, నగరాల్లోని ప్రత్యేక హోమియో దుకాణాలలో లభిస్తాయి. ఒకే హోమియో మందు అనేక పొటెన్సీలలో అందుబాటులో ఉంటుంది. పంటలకు సూచించిన హోమియో మందులను 6 లేదా 30 పొటెన్సీ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. 6 పొటెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల 30 పొటెన్సీ వాడుతున్నాం.

అంతకన్నా ఎక్కువ పొటెన్సీ గల మందులు అవసరం లేదు, వాడనూ కూడదు. పంట ఏదైనా రసంపీల్చే, కాయ తొలిచే, కాండం తొలిచే పురుగులకు సాధారణంగా తూజ మందు పనిచేస్తుంది. అయితే, మిరపలో నల్లపేనుపై తూజ పనిచేయనందునే ఆర్నేరియా డయాడెమా 30 మందును సూచిస్తున్నాం. ఆర్నేరియా డయాడెమా 30 వాడి ఇప్పటికే పలు జిల్లాల్లో మిరప రైతులు తోటలను రక్షించుకున్నారు. ఇతర వివరాలకు నా యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియోలు చూడవచ్చు. 
– జిట్టా బాల్‌రెడ్డి (89782 21966), రైతు శాస్త్రవేత్త,  అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top