
మనుషులను విడదీసేందుకు చాలా దారులు ఉన్నాయి. కానీ వారిని కలిపే పని సాహిత్యమే చేయగలదు. బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌ను నిర్వహించడం వెనుక ఈ సంకల్పమే ఉంది’ అన్నారు సతీష్ చప్పరికె. గత సంవత్సరం మొదలై ఇకపై ప్రతి ఏటా నిర్వహించ తలపెట్టిన నాలుగు దక్షిణాది భాషల భారీ సాహిత్య సమ్మేళనం‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ 2025 Book (Brahma Literature Festival-2025) సంవత్సరానికిగాను బెంగళూరులో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ ఫౌండర్, సీనియర్ పాత్రికేయుడు సతీష్ చప్పరికెతో సంభాషణ:
గత సంవత్సరం బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్‌కు వచ్చిన స్పందన ఎలా అనిపించింది?
నాలుగు దక్షిణాది రాష్ట్రాల రచయితలను ఒకచోట చేర్చి, వారు ఒకరితో ఒకరు పరిచయమయ్యేలా, పాఠకులతో ఇంటరాక్ట్ అయ్యేలా చేసి, మనదైన సాహితీ వాతావరణం ఏర్పరచడమే ఈ లిటరేచర్ ఫెస్టివల్ ఉద్దేశం. దక్షిణాది రచయితలందరూ పాల్గొనే ఇలాంటి ఫెస్టివల్ ఇంతకు మునుపు లేదు. అందుకే గత సంవత్సరం మూడు రోజుల పాటు 36 వేల మంది హాజరైతే, వీడియో ప్రసారాలను 42 దేశాల్లో రెండున్నర లక్షల మంది తిలకించారు. ఇది చాలా పెద్ద స్పందన.
ఈ సంవత్సరం విశేషాలు ఏమిటి?
గత సంవ త్సరం నాలుగు రాష్ట్రాల నుంచి 300 మంది రచయితలు పాల్గొంటే, ఈ సంవ త్సరం 450 మంది పాల్గొంటున్నారు. ఐదు వేదికల మీద మూడు రోజుల పాటు నిరాటంకంగా సెషన్స్ జరుగు తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్‌లో సెషన్స్ ఉంటాయి. దక్షిణాదిలో పుట్టి ఇంగ్లిష్‌లో రాస్తున్న రచయితలను కూడా ఈసారి ఆహ్వానించాం. ఈసారి పాల్గొంటున్న వారిలో అదూర్ గోపాలకృష్ణన్, దామోదర్ మౌజో, శశి థరూర్, బాను ముష్తాక్, జయ మోహన్, సచ్చిదానందన్, మను పిళ్లై తదితరులెందరో ఉన్నారు. మరో విషయం... ఈ ఫెస్టివల్‌లో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉండరు. ఇది పూర్తిగా సాహిత్య ఉత్సవం.

కన్నడ భాష నుంచి బాను ముష్తాక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచారు. ఆమెకు ఏదైనా సత్కారం ఉంటుందా?
ఆమెను ఈ ఫెస్టివల్‌కు ఆహ్వానించి పాఠకులు ఆమెతో ముచ్చటించేలా చేయడమే మేము చేసే సత్కారం. ఒక రచయిత పాఠకులను కలవడం కంటే ఏం కావాలి!
మీరు ఆహ్వానించే రచయితలు ఏ ధోరణి సాహిత్యానికి ప్రతినిధులు?
మీ ప్రశ్న నాకు అర్థమైంది. మేము లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు. ప్రజల తరఫున మాట్లాడే, సాహితీ వికాసం కోరే ప్రతి రచయితా మాకు మిత్రుడే.
ఈసారి తెలుగు నుంచి ఎవరెవరు ఆహ్వానం అందుకున్నారు?
గత సంవత్సరం 30 మందిని ఆహ్వానించాం. ఈసారి రచయితలు, పబ్లిషర్లు, పెర్ఫార్మర్లు దాదాపు 100 మంది వరకూ ఉంటారు. భాష ఒకటే అయినా రెండు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో ఆహ్వానించాం. ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బండి నారాయణ స్వామి, మధురాంతకం నరేంద్ర, కొలకలూరి ఇనాక్, పెద్దింటి అశోక్ కుమార్, షాజహానా తదితరులు ఉన్నారు. తగుళ్ల గోపాల్, బాల సుధాకర మౌళి తదితర యువ కవులను ఆహ్వానించాం.
గతంలో వచ్చినవారు రిపీట్ కాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ఈసారి ఆహ్వానం అందుకోనివారు వచ్చే సంవత్సరం అందు కుంటారు. అందరూ ఏదో ఒక సంవత్సరం పాల్గొనాలనేదే మా కోరిక. వీరిని ఆహ్వానించడంలో అనువాదకుడు అజయ్ వర్మ అల్లూరి మాకు సహకరిస్తున్నారు.
లక్ష్యం ఏమిటి?
మన దక్షిణాది భాషల్లో గొప్ప రచయితలు ఉన్నారు, రచనలు ఉన్నాయి. ప్రపంచ భాషలకు ఏమాత్రం తగ్గని పుస్తకాలు ఉన్నాయి. వాటిని ప్రపంచ భాషల్లోకి అనువాదం చేయించడం బుక్ బ్రహ్మ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాది భాషల సాహిత్య సౌరభాన్ని దేశం ఎదుట సగర్వంగా నిలిపేందుకు ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఎవరైనా ఉచి తంగా రిజిస్టర్ చేసుకుని హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ: ‘సాక్షి’ ప్రతినిధి‘