Artist Vijaya Lakshmi: సంకల్పానికి చిత్రరూపం

Artist Nara Vijaya Lakshmi Inspirational Story - Sakshi

ఆమె చిత్రలేఖనంలో మనకు కనిపించేది ఒక రూపం కాదు... అనేకం.   బుద్ధుడి బొమ్మలో కేవలం బుద్ధుడు మాత్రమే కాదు... బ్రష్‌ పట్టుకుని... తదేక దీక్షతో బుద్ధుడి బొమ్మ వేస్తున్న ఓ టీనేజ్‌ అమ్మాయి కూడా ఉంటుంది. రవివర్మ కుంచెకు అందిన అందం... విజయలక్ష్మి చిత్రాల్లో ద్యోతకమవుతుంది.

తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్‌– మల్కాజ్‌గిరి జిల్లా, శామిర్‌ పేట మండలంలో ఉంది తుర్కపల్లి. ఆ ఊరిలో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చిత్రలేఖనంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకుంది. కళారత్న, అబ్దుల్‌ కలామ్‌ అవార్డులతోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు, ప్రశంసలు ఆమె సొంతమయ్యాయి. తన రంగుల ప్రస్థానాన్ని, ఒక చిత్రంలో లెక్కకు మించిన వివరాలను పొందుపరచడంలో తన అభిరుచిని, బొమ్మల పట్ల తన ఇష్టాన్ని సాక్షితో పంచుకున్నారు విజయలక్ష్మి.  
 
అసాధారణమైన ప్రతిభ

‘‘నా జీవితంలో బొమ్మలు ఎప్పుడు ప్రవేశించాయో స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నా దృష్టిని ఆకర్షించిన దృశ్యాలకు చిత్రరూపం ఇవ్వడం నా బాల్యంలోనే మొదలైంది. నన్ను స్కూల్‌కి మా అన్న తీసుకు వెళ్లి, తీసుకువచ్చేవాడు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పుస్తకాలే నా లోకం. అందులోని బొమ్మలే నా స్నేహితులు. అందరి పిల్లల్లా ఆడుకోవడం నాకు కుదరదు కదా.

అందుకే చదువుకుంటూ, బొమ్మలేసుకుంటూ పెరిగాను. టెన్త్‌క్లాస్‌ తర్వాత కాలేజ్‌కెళ్లడం కష్టమైంది. కొన్నేళ్ల విరామంలో సైకాలజీ, ప్రముఖుల బయోగ్రఫీలు, భగవద్గీత... అదీ ఇదీ అనే తేడా లేకుండా నాకు దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివాను. ఆ తర్వాత డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేశాను. చదివేకొద్దీ నా ఆలోచన పరిధి విస్తృతం కాసాగింది. నా గురించి నేను ఆలోచించడమూ ఎక్కువైంది.

ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యాలను సాధించినప్పుడు ఆ వ్యక్తిని ఆ ప్రత్యేకతలతోనే గుర్తిస్తారు. ఇతర లోపాలున్నా సరే అవి తొలుత గుర్తుకురావు. నాకు ఎడమ చెయ్యి మాత్రమే మామూలుగా పని చేస్తుంది. రెండు కాళ్లు, కుడి చెయ్యి చిన్నప్పుడే పోలియో భూతం బారిన పడ్డాయి. నా పేరు విన్న వెంటనే కాన్వాస్‌ మీద అద్భుతాలు సృష్టించగలిగిన ఒక చిత్రకారిణి గుర్తుకురావాలి. సమాజం ఒక సాధారణ వ్యక్తిని సాధారణంగానే గుర్తిస్తుంది.

ఒక నైపుణ్యమో, వైకల్యమో ఉన్నప్పుడు వ్యక్తిగా గుర్తించడానికంటే ముందు నైపుణ్యం, వైకల్యాలతోనే పరిగణనలోకి తీసుకుంటుంది. పోలియో బాధితురాలిగా ఐడెంటిఫై కావడం కంటే విజయలక్ష్మి అంటే చిత్రలేఖనం గుర్తుకు వచ్చేటంతగా రాణించాలనుకున్నాను. అందుకోసమే అహర్నిశలూ శ్రమించాను. నేను చూసిన దృశ్యాల నుంచి నా బొమ్మల పరిధిని విస్తరించాను. నేను చదివిన పుస్తకాల నుంచి ఇతివృత్తాలను రూపుదిద్దుకున్నాను. అన్నింటికీ మించి రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందాను.  
 
రవీంద్రభారతిలో పురస్కారాలు
చిత్రకారిణిగా గుర్తింపు రావడమే కాదు, పురస్కారాలను రవీంద్రభారతిలో అందుకోగలిగాను. రవీంద్రభారతిలో అందుకోవడం కూడా ఒక పురస్కారంగానే భావిస్తాను. 2019లో నా చిత్రాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది.

అలాగే హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, సాలార్‌జంగ్‌ మ్యూజియంతోపాటు ఢిల్లీలోనూ ప్రదర్శితమయ్యాయి. మనలో ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష, సంకల్పబలం ఉంటే భగవంతుడు అవకాశం ఇచ్చి తీరుతాడని నమ్ముతాను. ఓ సంస్థ నా అవసరాన్ని గుర్తించి డెబ్బై వేల విలువ చేసే ఎలక్ట్రానిక్‌ వీల్‌చైర్‌ విరాళంగా ఇచ్చింది. అది కూడా భగవంతుడు పంపినట్లే.
 
స్ఫూర్తిప్రదాతగా...
నేను రాజా రవివర్మ నుంచి స్ఫూర్తి పొందితే, నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్న కొత్తతరం ఉండడం నాకు సంతోషంగా ఉంది. నేను చదువుకున్న స్కూల్లో నా బొమ్మలను ప్రదర్శించినప్పుడు నాకా సంగతి తెలిసింది. జీవితాన్ని నిస్సారంగా గడిపేయకూడదు, స్ఫూర్తిమంతంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్‌ మీడియాను నూటికి నూరుశాతం వినియోగించుకున్నాననే చెప్పాలి. సోషల్‌ మీడియా వేదికగానే ఇన్‌ఫ్లూయెన్సర్‌ని కాగలిగాను.

తలసేమియా వ్యాధిగ్రస్థులకు రక్తం కోసం ఏడాదికి మూడుసార్లు బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాను. మా ఊరి కుర్రాళ్లు ‘ఏం చేయాలో చెప్పక్కా, మేము చేసి పెడతాం’ అని ఉత్సాహంగా సహాయం చేస్తున్నారు. ‘వీల్‌చైర్‌ నుంచి నేను ఇన్ని చేస్తుంటే హాయిగా నడవగలిగిన వాళ్లు ఎందుకు చేయలేరు. స్థిరచిత్తం ఉంటే ఏదైనా సాధ్యమే’నని వీడియోల్లో చెబుతుంటాను’’ అని సంతోషంగా తన బొమ్మలలోకాన్ని వివరించింది విజయలక్ష్మి.

బుద్ధుడి వెనుక యువతి
విజయలక్ష్మి చిత్రలేఖనంలో ఉన్న అమ్మాయి అచ్చమైన తెలుగుదనంతో ఒత్తైన జడ వేసుకుని ఉంటుంది. ఆ జడను అలంకరించి పూలు కూడా అచ్చం పూలను పోలినట్లే తెల్లటి పువ్వులో పసుపువర్ణంలో పువ్వు మధ్యభాగం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెవి జుంకీలకున్న నగిషీలు కూడా. అలాగే మరో చిత్రలేఖనం ఇంకా అద్భుతం... మన దృష్టి అభయ ముద్రలో ఉన్న బుద్ధుడి మీద కేంద్రీకృతమవుతుంది.

బుద్ధుని పాదాల వద్దనున్న కమలం మీద, బుద్ధుడి శిఖ, శిఖ వెనుకనున్న కాంతివలయాన్ని కూడా చూస్తాం. ఆ తర్వాత మన దృష్టికి వస్తుందో అద్భుతం. ఆ బుద్ధుడి బొమ్మ ఉన్నది కేవలం కాన్వాస్‌ మీద కాదు. ఒక యువతి వీపు మీద. అటువైపు తిరిగి కూర్చుని ఉన్న  యువతిని చిత్రీకరించిన తర్వాత ఆమె వీపు మీద చూపరులకు అభిముఖంగా ఉన్న బుద్ధుడిని చిత్రించింది విజయలక్ష్మి.  

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top