న్యూస్‌రీల్
భారీ భూ కుంభకోణం
నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు ఛేదించారు. 8లో u
నవ్విపోదురుగాక నాకేంటన్న చందాన ఉంది కూటమి పాలకుల తీరు. ఎన్నికల హామీలను గాలికొదిలేసి రెండేళ్ల పాలనపై విజయోత్సవ సంబరాలు చేసుకోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మద్యాన్ని ఏరులై పారించడం, ఇసుక, మట్టి దోపిడీ తప్ప పేదల కోసం ఏం చేశారని ప్రజాధనం వృథా చేస్తూ వేడుకలు చేసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కూటమి సంబరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
● హామీలు విస్మరించి.. వంచనతో పాలించి
● కూటమి రెండేళ్ల సంబరాలపై ముక్కున వేలేసుకుంటున్న జనం
● జిల్లాలో నేడు సంబరాలు
శురకవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, భీమవరం
● వ్యవ‘సాయ’మేది?
గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత పంటల బీమాని ఎత్తేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపారు. పాత బకాయిలతో దాదాపు రూ. 21 కోట్లు నీటి తీరువాను వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో మోంథా తుపానుతో 9,201 హెక్టార్లలో రూ.23 కోట్ల మేర పంట నష్టం వాటిల్లితే మళ్లీ ఖరీఫ్ మొదలైన పరిహారం ఇవ్వలేదు. జిల్లాలోని 80 వేల మంది కౌలు రైతులకు సాయంపై మాట్లాడటం లేదు. అగ్రిల్యాబ్‌లు, ఆర్‌బీకేలను అధోగతిపాల్జేశారు. ఆక్వా రైతులకు రూ.1.50 రాయితీ విద్యుత్ ఇస్తామని ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ పేరుతో ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీకి ఎగనామం పెట్టే పనిలో ఉన్నారు. రొయ్య రేట్లు తగ్గించి, మేత ధరలు పెంచేసి సిండికేటు చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయలేకపోతున్నారు.
● అను‘గృహం’ ఎప్పుడు?
ఇళ్లు లేని పేదలకు మూడు సెంట్లు స్థలం ఇస్తామని సెంటు కూడా ఇవ్వలేదు. ఇంటి నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు సాయం అందిస్తామని చెప్పినా ఆ ఊసేలేదు. సొంతింటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు మంజూరులేదు. పీఎం ఆవాస యోజనగా ఇటీవల పట్టణ ప్రాంతాల్లోని 595 ఇళ్లను మంజూరు చేశారు. ఆవాస్ ప్లస్‌లో 16,773 ఇళ్లను సర్వే చేసి 10,789 మంది అర్హులుగా గుర్తించగా వీరంతా మంజూరు కోసం చూస్తున్నారు. గతంలో ఇచ్చిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.
● వైద్యానికి సుస్తీ
ఆనారోగ్యం వస్తే ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులు వస్తారన్న భరోసా. ఎంత పెద్ద రోగమైనా ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతుందన్న ధీమా. కోలుకునే వరకు జీవనోపాధికి ఆరోగ్య ఆసరా వస్తుందన్న నమ్మకాన్ని కూటమి దూరం చేసింది. గతంలో జిల్లాలోని ఆచంట, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం సీహెచ్‌సీల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు, కళ్లజోళ్ల పంపిణీకి మంగళం పాడింది. బకాయిల కోసం నెట్‌వర్క్ ఆస్పత్రులు పలుమార్లు ఆరోగ్యశ్రీ సేవలను బహిష్కరించిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, అరకొర సేవలతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
● ఏదీ ధీమా
ఇంటి యజమాన్ని కోల్పోయి దిక్కుతోచని కుటుంబానికి ఆధారమైన బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ప్రమాదం, ఆనారోగ్యం కారణంగా రెండేళ్లలో ఇంటి పెద్ద మృతితో బీమా సాయం అందక జిల్లాలో రోడ్డున పడ్డ కుటుంబాలెన్నో.
● ఏమీలేదని‘పింఛెన్’
పేదలకు ఆర్థిక భరోసానిచ్చే పింఛన్ల మంజూరును విస్మరించింది. 2024 జూన్ నాటికి జిల్లాలో 2,32,885 మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 2,20,843 తగ్గింది. రెండేళ్లలో కొత్త పింఛన్ ఒక్కటి ఇవ్వక వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్లు కోసం జిల్లాలో వేల మంది ఎదురుచూస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ హామీ ఊసెత్తడంలేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య పింఛన్‌కు అర్హత కలిగిన వారు 2 లక్షల మంది ఉంటారని అంచనా.
● మహిళకు వంచన
సూపర్‌సిక్స్‌లో మొదటిదైన ఆడబిడ్డ నిధి అమలవ్వక రెండేళ్లలో జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5,96,313 మంది మహిళలు రూ.2147 కోట్లు నష్టపోయారు. మహిళల కోసం గత ప్రభుత్వం తెచ్చిన చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వడ్డీ రాయితీ పథకాలను తుంగలోకి తొక్కారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.10 లక్షల వరకు పెంపు, మహిళ ఉద్యోగులకు హాస్టల్ వసతి, అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు హామీలను గాలికొదిలేశారు. జిల్లాలోని 3,486 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఏడాదవుతున్నా మిషన్లు ఇవ్వలేదు.
‘‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలతో ఉన్న ఈ చిత్రాన్ని చూశారా? కూటమి వచ్చిన 2024 జూన్ నుంచే ఇచ్చే పథకాలు అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ఇంటింటికీ పంచిన కరపత్రమిది. పాలకొల్లులోని ఒక కుటుంబంలో నలుగురు సభ్యుల్లో ఇద్దరు మహిళలకు ఆడబిడ్డ నిధిగా ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున ఏడాదికి రూ.36 వేలు. ఇద్దరు యువకులకు నిరుద్యోగ భృతిగా నెలకు ఒక్కొక్కరికి రూ.3 వేలుచొప్పున ఏడాదికి రూ.72 వేలు. మొత్తం రూ.1.08 లక్షలు లబ్ధి చేకూరుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. దీనినే బాండ్ పేపర్‌గా భావించమని సంతకాలు చేసిచ్చారు. రెండేళ్లలో ఆ కుటుంబానికి రూ.2.16 లక్షల సాయం అందాలి. నెలనెలా ఇస్తామన్న ఆడబిడ్డ నిధి, రూ.మూడు వేల నిరుద్యోగ భృతి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఎంత మేలు చేసింది పాలకులే చెప్పాలి’’
ప్రగతి.. అధోగతి
జిల్లాకు తలమానికంగా నరసాపురం రూరల్ లిఖితపూడిలోని 40 ఎకరాల స్థలంలో రూ.వంద కోట్లతో చేపట్టిన ఆక్వా వర్సిటీ పనులను ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసింది. అద్దె భవనంలో ఆక్వా కళాశాల నిర్వహిస్తోంది. రూ.475 కోట్లతో పాలకొల్లు రూరల్ దగ్గులూరులోని 60 ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులకు ప్రైవేటీకరణ గ్రహణం పట్టింది.
పేదల విద్యకు ఎసరు
కార్పొరేట్‌కు కొమ్ముకాస్తూ సంస్కరణల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అధోగతి పాల్జేస్తున్నారు. నాడు–నేడు అభివృద్ధి పనులను, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ఆపేశారు. గతంలో పాఠశాలలు తెరిచిన రోజునే బుక్స్, యూనిఫాం, బూట్లు తదితర వాటితో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తే అరకొరగా నాసిరకం కిట్లను అందజేస్తూ వస్తున్నారు.


