నూజివీడు: ఆర్జీయూకేటీ పరిఽధిలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 2026–27 విద్యా సంవత్సరంలో పీయూసీలో ప్రవేశాలకు శుక్ర, శనివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 1,100 సీట్లలో ప్రత్యేక కేటగిరీ సీట్లను మినహాయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ట్రిపుల్‌ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లోని ఆడిటోరియంలోని కౌన్సెలింగ్ హాల్‌లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. రోజుకు 550 మంది చొప్పున రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 30 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు 100 మంది సిబ్బందిని, వలంటీర్లుగా మరో 100 మంది విద్యార్థులను నియమించారు. డేటా ఎంట్రీ కౌంటర్స్, అకడమిక్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కౌంటర్స్, ఫీజు చెల్లించే కౌంటర్లు, కుల ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్‌కు కౌంటర్లు, ఐడీ కార్డుల జారీ కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను డైరెక్టర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, ఏఓ బి.లక్ష్మణరావు పర్యవేక్షిస్తున్నారు. జూలై 1నుంచి పీయూసీ ఫస్టియర్ తరగతులు ప్రారంభమవుతాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాను ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 3,563 మంది హాజరుకాగా వారిలో 35.25 శాతంతో 1,256 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,514 మంది హాజరుకాగా వారిలో 48.72 శాతంతో 1,712 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 13,539 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,193 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీ కౌంటింగ్‌కు పేపర్‌కు రూ. 260, రీ వెరిఫికేషన్‌కు పేపర్‌కు రూ.1,300 చెల్లించి తమ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
భీమవరం (ప్రకాశం చౌక్): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జగదీశ్ మైరెన్, సంధ్య మైరెన్, ఆనంద్ గ్రూప్ అపోలో ఫార్మసీ, డి మార్ట్, రిలయన్స్ వంటి కంపెనీల్లో భీమవరం ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. 18–35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. వివరాలకు 73308 03719, 94928 85556 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఈనెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో గురువారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి తిరిగే బస్సుల్లో ఆయా ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌ను చూపించి ఇంటి వద్ద నుంచి పరీక్షా కేంద్రాలకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు.


