● ఒడిసా వర్కర్ల నియామకంపై అభ్యంతరం
● స్థానిక మహిళల ఉపాధికి గండి
● విద్యార్థుల భద్రతా ప్రశ్నార్థకం?
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీలో పనిచేసేందుకు ఒడిసా నుంచి వర్కర్లను తీసుకురావడంపై అటు స్టాఫ్.. ఇటు విద్యార్థులతో పాటు ఇప్పటివరకూ పనిచేస్తున్న సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఊరూపేరు తెలియకుండా దాదాపు 80 మంది వర్కర్లను తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలోని మెస్‌లను హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు టీడీపీ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ నుంచి టెండర్లు ఏమీ లేకుండా ఏకపక్షంగా అప్పగించింది. అయితే ఈ మెస్‌లలో నూజివీడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేద మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరి ఉపాధికి గండికొట్టేలా మెస్‌లను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఒడిసా యువకులను తీసుకురావడం ట్రిపుల్‌ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మెస్ నిర్వాహకులు తీసుకువచ్చిన 80 మంది ఒడిసా కూలీలు ట్రిపుల్‌ఐటీలోని మెస్‌లోనే గత వారం రోజులుగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థ లోపల వాళ్లు ఎలా ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
యువకులతో వడ్డనా..?
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మొత్తం విద్యార్థుల్లో 65 శాతం నుంచి 70 శాతం మంది విద్యార్థినులే ఉన్నారు. ఇప్పటివరకు మెస్‌లలో వడ్డన చేయడం, డైనింగ్ హాల్స్ శుభ్రం చేయడం, వంట పాత్రలు కడగడం, కుర్చీలు, టేబుల్స్ తుడవడం వంటి పనులన్నింటినీ స్థానికంగా ఉండే మహిళలే చేసేవారు. ఇప్పుడు వారిని తొలగించి ఈ పనులను చేయడానికి ఒడిసా యువకులను పెడుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. మెస్‌లలో ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి యువకులను ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థినులకు సురక్షితమేనా?
యువకులందరిది ఒడిసా కాగా.. వారు ఏ ఊరివారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్రవర్తన, ఏమైనా నేర స్వభావం ఉందా.. గతంలో ఏమైనా నేరాలు చేశారా అనే వివరాలు ఏమీ తెలియకుండా ఇక్కడి మెస్‌లలో పెట్టడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 8 వేల మంది విద్యార్థుల్లో 5 వేలకు పైగా బాలికలే ఉన్నారు. క్యాంపస్‌లోనే బోధనా సిబ్బంది అంతా క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ముక్కూమొహం తెలియని వారిని తీసుకొచ్చి పెడితే ఎలాగనే ప్రశ్నలు సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ట్రిపుల్‌ఐటీ పెట్టిన నాటి నుంచి నూజివీడుతో పాటు చుట్టుపక్కల ఉన్న సుంకొల్లు, యనమదల, రేగుంట, పోతురెడ్డిపల్లి గ్రామాలకు చెందిన పేద మహిళలు మెస్‌లలో పనిచేసేవారు. ఒడిసా యువకులతో వీరందరి ఉపాధి పోనుంది. దీంతో వీరు ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


