భీమవరం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసింది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మనబడి, నాడు – నేడు పేరిట అభివృద్ధి పనులు చేపట్టింది. అనంతరం ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాఠశాలల అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ పనులు పూర్తిచేయడం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జగన్ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా..
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేలకు పైగా విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించక తప్పేదికాదు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిపెట్టి మనబడి, నాడు–నేడు పథకంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడమేగాక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పాఠశాలల్లో డిజిటల్ బోధన అమలు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది.
అసంపూర్తిగా నిర్మాణాలు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ అధునీకరిస్తున్న సమయంలో 2024లో ప్రభుత్వం మారింది. నాడు–నేడు పనులకు బ్రేక్ పడింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కొన్ని భవనాలు పునాదుల్లోనే నిలిచిపోగా మరికొన్ని భవనాలు గోడలు నిర్మాణం, ప్లాస్టింగ్ పనులు పూర్తికాక నిరుపయోగం ఉన్నాయి. జిల్లాలోని 254 స్కూళ్ల మరమ్మతులు, మరో 158 స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మాణం జరగాల్సి ఉంది. వీటికిగాను దాదాపు రూ.13 కోట్లు నిధులు అవసరం ఉంటుంది.


