చింతలపూడి: సీతానగరంలోని గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని గురువారం పామాయిల్ రైతులు ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.రంగారావు, జగ్గవరపు ముత్తారెడ్డి, ఆచంట సూర్య నారాయణ, పెన్మెత్స రామరాజు, సూరానేని గోపినాథ్, అలవాల ఖాదర్‌బాబురెడ్డి, కె రమేష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, తెగడ వెంకన్న మాట్లాడుతూ పండించిన పంటకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను ఇవ్వకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే గిట్టుబాటు ధరను రైతులకు చెల్లించాలని, రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, యాజమాన్యం స్పందించి శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


