ఫైల్‌ను కలెక్టర్‌కు పంపించాం
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమానికి చిరునామాగా నిలిచి, పేదల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ముదినేపల్లి తహసీల్దారు కార్యాలయంలో ఓ మూలన పడి ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ముదినేపల్లి ప్రధాన సెంటర్‌లో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహంతో పాటు బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలను, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు గతంలో తొలగించారు. అయితే అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో జాతీయ రహదారి నిర్మాణదారులు సొంత నిధులతో కొంత దూరంలో దాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. కానీ వైఎస్సార్ విగ్రహాల పునఃప్రతిష్ఠ విషయంలో మాత్రం అధికారులు, పాలకులు వివక్ష చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి నాయకుల పక్షపాత ధోరణి
కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది అభిమానులు గుండె ఆగి మృతి చెందారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా అభిమానులు, ప్రజలు గ్రామగ్రామాన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ముదినేపల్లి ప్రధాన సెంటర్‌లోని పోలీస్ స్టేషన్, బస్టాండ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహాలను నిర్మించారు. ఏటా వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, సంతాప సభలు నిర్వహిస్తుంటారు. జాతీయ రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నాడు అధికారులు అన్ని పార్టీల నాయకుల విగ్రహాలను తొలగించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ విగ్రహాల పునఃనిర్మాణంలో కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వినతులు బుట్టదాఖలు
ముదినేపల్లి బస్టాండ్, పోలీస్ స్టేషన్ల వద్ద తొలగించిన వైఎస్సార్ విగ్రహాలను వై–జంక్షన్, లేదా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ వెలుపల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మే 24న వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బోయిన రామరాజు ఆధ్వర్యంలో తహసీల్దారు ఎస్‌కే. లతీఫ్‌పాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముదిరాజుల సంఘ విభాగం అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి గంటా సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ ఏసుబాబు పాల్గొన్నారు. వినతిపత్రం ఇచ్చి రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదు.
అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయం
రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ముదినేపల్లి శ్రీవైశ్రీ జంక్షన్‌లో పునఃప్రతిష్ఠించడానికి దిమ్మల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాలతో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా దాని పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించారు. అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉండటంతో, దివంగత వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, అభిమానులు అధికారులను కోరినా ఎలాంటి స్పందనా లేదు. కనీసం జాతీయ రహదారి, జిల్లా అధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతులు లేకుండానే కూటమి నేతలు తమ విగ్రహాల నిర్మాణాలకు ఉపక్రమించడం గమనార్హం.
వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన రోజునే ఫైల్‌ను జిల్లా కలెక్టర్‌కు పంపించాం. అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
– ఎస్‌కే. లతీఫ్‌పాషా, ముదినేపల్లి తహసీల్దార్
అనుమతులు లేకుండా ఎన్‌టీఆర్ విగ్రహ పునఃప్రతిష్ఠ పనులు
వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని వినతి పత్రం ఇచ్చినా స్పందన నిల్


