జంగారెడ్డిగూడెంలో భారీ భూ కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెంలో భారీ భూ కుంభకోణం

Jun 19 2026 12:42 AM | Updated on Jun 19 2026 12:42 AM

జంగారెడ్డిగూడెం: నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులను మోసం చేస్తూ సాగుతున్న ఒక భారీ భూ కుంభకోణాన్ని జంగారెడ్డిగూడెం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ మాట్లాడుతూ ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. పట్టణంలోని రామచంద్రపురం ప్రాంతానికి చెందిన రాజనాల రమాదేవి అనే మహిళకు చెందిన 625 చదరపు గజాల విలువైన స్థలాన్ని అక్రమంగా కాజేయడానికి కుట్ర చేశారన్నారు. రమాదేవి తన ఆస్తిని ఉండి కృష్ణవేణి అనే మహిళకు వీలునామా రాసిచ్చినట్లు ఒక నకిలీ వీలునామాను, అలాగే రమాదేవి మరణించినట్లు ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారన్నారు. ఆ తర్వాత ఈ తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించి సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. అనంతరం ఆ స్థలాన్ని భాగాలుగా విభజించి, ఇతర నిందితుల పేర్లపై మార్చి, చివరకు వేగవరం ప్రాంతానికి చెందిన కొనుగోలుదారులకు విక్రయించారన్నారు. ఈ విధంగా అసలు యజమానురాలిని మోసం చేసి సుమారు రూ.55 లక్షలు అక్రమంగా ఆర్జించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

నిందితులు వీరే

ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్‌, సిబ్బంది గురువారం ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారన్నారు. ఈ కేసులో జంగారెడ్డిగూడేనికి చెందిన ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలియాస్‌ సత్తిరాజు, సజ్జా రమేశ్‌ బాబు, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ మాజీ అధికార ప్రతినిధి గెడా సుబ్రహ్మణ్యం, నిడదవోలుకు చెందిన జెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్‌ ఉమ, తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన దాసరి సురేశ్‌ అలియాస్‌ స్టాలిన్‌లను అరెస్టు చేసి వారి నుంచి నేరానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, నకిలీ వీలునామా, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏఎస్పీ తెలిపారు. స్థలాలు, ఇళ్లు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఆస్తి పత్రాలు, రిజిస్ట్రేషన్‌ వివరాలు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), రెవెన్యూ రికార్డులను అసలు యజమాని వివరాలతో సరిచూసుకోవాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ తెలిపారు.

మహిళతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement