కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించగా 83 రోజులుగాను రూ.21,25,181 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం.అరుణ్ కుమార్ తెలిపారు.
ముసునూరు: గత కొన్ని రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ మోటార్ల వైర్లను వరుసగా చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. ఈ చోరీలపై కొద్ది రోజుల నుంచి గస్తీ ముమ్మరం చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా బైక్‌పై మోటారు వైర్లు తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. కాగా దొంగల ముఠాలో పరివర్తన కోసం నూజివీడు ప్రధాన కూడలి నుంచి కోర్టు వరకు బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఐవీ నాగేంద్ర కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
భీమడోలు: మండలంలోని పూళ్లలో ఓ పాఠశాల విద్యార్థిని అదృశ్యమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పూళ్లకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుమార్తె పూళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటుంది. ఈ క్రమంలో యథావిధిగా పాఠశాలకు వెళ్లిన విద్యార్థినీ మధ్యాహ్న భోజనం చేసి ఉపాధ్యాయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లిపోయింది. పాఠశాలలోని మధ్యాహ్నం తరగతులకు హాజరుకాకపోవడంతో హెచ్‌ఎం బాలిక తండ్రికి సమాచారం అందించారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యుల సాయంతో ఆచూకీ కోసం బంధువులు, ఇతర పరిసరాలను గాలించారు. ఫలితం లేకపోవడంతో గురువారం రాత్రి భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమడోలు ఎస్సై మదీనా బాషా తెలిపారు.
గూటాల ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల
పోలవరం రూరల్: మండలంలోని గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతులకు అవసరమైన గోదావరి సాగునీటిని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరించారు.


