బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన పులిరామన్నగూడెంలో గత వారం రోజులుగా మా పాఠశాల మాకే కావాలంటూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల గేట్లకు తాళాలు వేసి పాఠశాలలు తెరవకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.రాములు నాయక్ అక్కడికి ఆందోళన కారులతో చర్చలు జరిపారు. పాఠశాల కొనసాగింపుపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామని అవి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమ పాఠశాల దశాబ్దాల క్రితమే ఏర్పడిందని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పాఠశాల స్థాయికి పెంచడంతోపాటు వసతిగృహం సదుపాయాన్ని కూడా కల్పించారని తెలిపారు. అయితే ఆయన మనుమడు మంత్రిగా ఉన్న విద్యాశాఖ రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలను కుదించడం వల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్థన్‌రావు, న్యాయవాది యు.ఏసుబాబు, గ్రామస్తులు మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, జి.లక్ష్మీనారాయణ, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇటికిలకోటలో..
పోలవరం రూరల్: మండలంలోని ఇటికలకోటలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో 8, 9, 10 తరగతులను కుదించాలనే ప్రభుత్వ నిర్ణయంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గత రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించాలని సూచించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పాఠశాలకు తాళాలు వేయడంతో విద్యార్థులను ఎదురుగా ఉన్న భోజనశాలలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు సున్నం గంగాజలం, తామా బాలరాజు, ధర్ముల లక్ష్మి, పోసి రత్నం తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : పీఆర్‌గూడెం పాఠశాల గేటు వద్ద గ్రామస్తులతో చర్చిస్తున్న పీఓ
పోలవరం రూరల్ : ఇటికిలకోటలో పాఠశాల గేటుకు తాళాలు వేసి ఆందోళన చేస్తున్న గిరిజనులు


