నరసాపురం: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ..దళిత క్రైస్తవులపై దాడులకు దిగుతూ రెచ్చిపోతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. గురువారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన దళిత క్రైస్తవ సమైక్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1.10 కోట్ల ఓట్లు ఉన్న దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కరలేదు అనే ధైర్యం రఘురామకృష్ణరాజుకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో దళితుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం అడ్రస్ గల్లంతు కావడం తథ్యమన్నారు. హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఏలూరులో ఈనెల 28న లక్ష మందితో చేపట్టిన దళిత క్రైస్తవ సమరశంఖారావం బహిరంగసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఇంజేటి జాన్‌కెనడీ, సోడదాసి శ్రీధర్, నల్లిమిల్లి జోసఫ్, గూటం జయరాజు, చదలవాడ జ్ఞానప్రకాష్, దొండపాటి స్వాములు, దీపాటి జానకీరాజు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్


