దేవరపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్‌స్టేషన్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న పాత జీఎన్‌టీ రోడ్డుపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆయన ఇద్దరు కుమారులు, సుమారు 100 మంది కలిసి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా గుమిగూడారని, రోడ్డుపై నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సంఘటనలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన చేపట్టి, ఫొటోలు, వీడియోలు, డ్రోన్ వీడియోల ద్వారా అందరినీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీఐ తెలిపారు.
విచారణకు శేషుబాబు హాజరు
దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లోని సర్కిల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఆయనను సీఐ నాయక్ సుమారు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి ఈ నెల 29న మళ్లీ విచారణకు హాజరు కావాలని పంపించారు. విచారణ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, గౌడ సంఘాల నాయకులు శేషుబాబుకు మద్దతుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శేషుబాబు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కూటమి నాయకుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. అయినా అక్రమంగా కేసులు పెట్టి, విచారణకు పిలిచి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్నామనే కక్షతో, రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


