లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jun 19 2026 12:42 AM | Updated on Jun 19 2026 12:42 AM

లారీ ఢీకొని వ్యక్తి మృతి వరకట్న వేధింపులపై కేసు

తాడేపల్లిగూడెం రూరల్‌: మోపెడ్‌ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమగిరి రాజు (42) తాడేపల్లిగూడెంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం బట్టల దుకాణానికి వెళ్తున్న సమయంలో గ్రామంలోని కూడలికి కొంచెం దూరంలోనే టిప్పర్‌ లారీ ఢీకొనడంతో దాని చక్రాల కింద పడ్డాడు. దీంతో లారీ చక్రాలు రాజు నడుముపై నుంచి వెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య మహాలక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బట్టల దుకాణానికి వెళ్తూ తన తండ్రి ఫొటో తీయించుకున్నట్లు మూడో కుమార్తె ప్రత్యూష విలపించడం చూపరులను కలచివేసింది. ఈ మేరకు రూరల్‌ ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.

పాలకోడేరు: అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఏఎస్సై నరసింహమూర్తి తెలిపారు. మోగల్లు గ్రామానికి చెందిన జోగి అనూషకు పెనుమంట్ర మండలం, బ్రాహ్మణచెరువుకు చెందిన సత్య హరిశ్చంద్ర ప్రసాద్‌ తో 2013లో వివాహమైంది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల అదనపు కట్నం కావాలంటూ భర్తతో సహా ఐదుగురు అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement