ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తెలిపారు. ఏలూరు, భీమడోలు, కైకలూరు, పెదపాడు ప్రాజెక్టుల్లో మొత్తం 8 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 101 మంది అంగన్వాడీ సహాయకురాలు, 1 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. మొత్తం 270 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏలూరు ప్రాజెక్ట్ సీడీపీవో ఏ.పద్మావతి, భీమడోలు ప్రాజెక్ట్ సీడీపీవో రాజశేఖర్, కై కలూరు ప్రాజెక్ట్ సీడీపీవో దీప్తి, పెదపాడు ప్రాజెక్ట్ సీడీపీవో విజయకుమారి, రోహిత్ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని విద్యా సంస్థల బస్సుల్లో తప్పనిసరిగా డాష్‌బోర్డ్ కెమెరాలను అమర్చాలని, ప్రయాణ సమయంలో విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డీటీసీ విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తమ అధికారులు జరిపిన తనిఖీల్లో విద్యా సంస్థల బస్సుల్లో ఇంకా డాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తేలిందన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, తప్పనిసరిగా డాష్‌బోర్డ్ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లోగా అన్ని బస్సుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తామని విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రవాణా శాఖ ప్రాంతీయ రవాణా అధికారి శేఖర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జూలై 19వ తేదీన రాజమండ్రిలోని మన్యం గార్డెన్స్‌లో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న ట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు భమిడిపల్లి వెంకట రమణమూర్తి (బాబు), రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026 పురస్కరించుకుని ప్రజల శారీరక–మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్టన్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ శిబిరాలు, ప్రదర్శనలు, సామూహిక యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా తటవర్తి కృష్ణమూర్తి ఎంపికయ్యారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ సంఘం నుంచి కృష్ణమూర్తిని 2026– 28 సంవత్సర కాలానికి నియమిస్తూ వచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర మాజీ కార్యదర్శి నాలం బాపిరాజు, మాటూరి నరసింహమూర్తి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం పటిష్టతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ సంఘ అధ్యక్షుడు రేపాక ప్రవీణ్‌భాను తదితరులు పాల్గొన్నారు.


