నిందితుడిని నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
● హత్య చేసి బంగారం, డబ్బు చోరీ
● మరో కేసులో గంజాయి ముఠా అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కై కలూరు టౌన్ ప్రాంతంలో ఒంటరి, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో హత్యలు చేస్తూ, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేస్తున్న వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 13న కై కలూరు పాములవీధికి చెందిన మార్పిన వరలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె ఒంటిపై ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు, అదే వీధికి చెందిన కోమటి మామ అలియాస్ సోము అనే వృద్ధురాలిని కూడా జూన్ 3న ఇదే తరహాలో హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి. ప్రేమ వివాహం చేసుకుని, జూదానికి, మద్యానికి బానిసై అప్పులపాలైన ఽధ్రువంత్ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన హెచ్‌సీలు ఎన్. వెంకటేశ్వరరావు, బి. భూషరావు, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, నాగార్జున, వంశీకృష్ణ, హోంగార్డులు రాము, ఫణిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి ముఠా అరెస్టు
మరో కేసులో, ఏలూరు త్రీటౌన్ పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా జాతీయ రహదారిపై సీతాపురం వద్ద వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజమహేంద్రవరం మీదుగా శ్రీకాళహస్తికి కారు, బైక్‌పై తరలిస్తున్న 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు పాల్పడుతున్న బోనంగి నానాజీ, బోనంగి సత్యనారాయణ, మర్లపూడి దుర్గాప్రసాద్, మురుకుట్టి ఈశ్వరసాయి సతీష్‌లను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరిపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బాలెనో కారు, మోటారు సైకిల్‌ను సీజ్ చేసి, ఈ నెట్‌వర్క్‌తో సంబంధమున్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కై కలూరు: వ్యసనాలకు బానిసై రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న సీరియల్ కిల్లర్ తుపాకుల ధ్రువంత్(24)ను కై కలూరు పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు నడిరోడ్డుపై బుధవారం నడిపించుకుని తీసుకెళ్లారు. స్థానిక ఏజీఎఫ్‌సీఎం కోర్టులో అతడిని హాజరపర్చగా మేజిస్ట్రేట్ రెండు వారాలు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని పోలీసులు బందరు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ఏవీఎస్.రామకృష్ణ మాట్లాడుతూ కేసులో ప్రతిభ చూపిన హెచ్‌సీలు ఎన్..వెంకటేశ్వరరావు, బీ.భూషణరావు, పీసీలు ఎస్.శ్రీకాంత్, కే.నాగార్జున, ఎం.వంశీకృష్ణ, హోంగార్డులు పి.రాము, బి.ఫణీలను ఎస్పీ అభినందించారని తెలిపారు.


