కై కలూరు: సమాజంలో మహిళలు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సూచించారు. కై కలూరు 8వ వార్డులో ఇటీవల వరుస హత్యలకు గురైన మార్పిన వరలక్ష్మీ (50), సోము ఆదిలక్ష్మీ (80) కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శింంచారు. ఇదే వార్డులో తుపాకుల ద్రువంత్ (24) అనే వ్యక్తి చెడు వ్యవసనాలకు బానిసై ఇద్దరి మెడలో ఆభరణాలు దొంగిలించి హత్య చేశాడు. దీంతో వార్డుకు వెళ్లిన డీఎన్నార్‌తో మహిళలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. భయం భయంగా బతుకుతున్నామని వాపోయారు. అతను పట్టుబడకపోతే మరికొందరి ప్రాణాలు తీసేవాడని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో డీఎన్నార్ మాట్లాడుతూ మద్యం, జూదం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైన యువకులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారన్నారు. మహిళలు భయపడవద్దని సూచించారు. కార్యక్రమంలో తోట మహేష్, శంకర్, నానీ తదితరులు పాల్గొన్నారు.


