హైస్కూల్‌ ప్లస్‌.. నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

హైస్కూల్‌ ప్లస్‌.. నిర్వీర్యం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

హైస్కూల్‌ ప్లస్‌.. నిర్వీర్యం

సప్లిమెంటరీ విద్యార్థులనైనా చేర్చుకోవాలని చెప్పాం

200 మంది పాసైనా.. చేరింది సున్నా

ముసునూరులో అడ్మిషన్లు నిల్‌

ప్రచారంలో ఉపాధ్యాయుల వైఫల్యం

బడి తెరిచిన రెండు రోజులకే టీచర్ల డిప్యుటేషన్‌?

నూజివీడు: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అశ్రద్ధ వెరసి గ్రామీణ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ‘హైస్కూల్‌ ప్లస్‌’ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. మండల కేంద్రమైన ముసునూరులోని జెడ్పీ హైస్కూల్‌ ప్లస్‌లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడ్మిషన్‌ కూడా నమోదు కాలేదు. కనీసం అదే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినుల తల్లిదండ్రులను కలిసి, ఇంటర్‌లో చేర్పించేలా ఉపాధ్యాయులు చైతన్యపరచకపోవడం గమనార్హం.

బాల్య వివాహాల నివారణే లక్ష్యంగా..

గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాలికలకు ఉచితంగా ఇంటర్‌ విద్యను అందించాలనే సదాశయంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మండలానికి ఒక జెడ్పీ హైస్కూల్‌ను శ్రీహైస్కూల్‌ ప్లస్‌శ్రీగా అప్‌గ్రేడ్‌ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం వల్ల పదో తరగతి పూర్తి కాగానే ఆడపిల్లలను దూర ప్రాంతాలకు పంపలేక చాలామంది తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చి, బాలికలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలను ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది.

విద్యార్థులు లేకున్నా అదనపు ఇంక్రిమెంట్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌తో ఇక్కడ పీజీటీలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వం బేసిక్‌ జీతంతో పాటు అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ (నెలకు సుమారు రూ.4 వేలు) చెల్లిస్తోంది. గతేడాది విద్యార్థులు లేకపోయినా ఈ నలుగురు ఉపాధ్యాయులు అదనపు ఇంక్రిమెంట్‌తో కూడిన జీతాన్ని డ్రా చేశారు. విద్యార్థులకు బోధించకుండానే ప్రభుత్వ సొమ్మును జీతంగా పొందిన వీరి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రెండు రోజులకే పని సర్దుబాటా?

ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. 13, 14 తేదీల్లో సెలవులు వచ్చాయి. కేవలం 15వ తేదీ ఒక్కరోజే స్కూల్‌ నడిచింది. అయితే, విద్యార్థినులు లేరనే సాకుతో ముసునూరు హైస్కూల్‌లో పనిచేస్తున్న నలుగురు పీజీటీలను నూజివీడులోని బాలికల హైస్కూల్‌ ప్లస్‌కు పని సర్దుబాటు (డెప్యుటేషన్‌) కింద పంపుతూ డీవైఈఓ ఉత్తర్వులు జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బడి తెరిచిన కేవలం రెండు రోజులకే విద్యార్థులు లేరని తేల్చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కనీసం నెల రోజుల పాటు అడ్మిషన్ల కోసం ప్రయత్నించి, అప్పటికీ పిల్లలు చేరకపోతే వేరే చోటుకు పంపాలి గానీ.. ఇంత త్వరగా డెప్యుటేషన్‌ ఆర్డర్స్‌ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముసునూరులోని జెడ్పీ హైస్కూల్‌ ప్లస్‌

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులనైనా ఇంటర్‌లో చేర్చుకోవాలని స్థానిక ప్రధానోపాధ్యాయుడికి సూచించాం. ఒకవేళ విద్యార్థినులు చేరితే ప్రస్తుతం పని సర్దుబాటు కింద వేరే పాఠశాలకు పంపిన ఉపాధ్యాయులను మళ్లీ ముసునూరు హైస్కూల్‌ ప్లస్‌కే రప్పిస్తాం.

– పీఎస్‌ సుధాకర్‌, డీవైఈఓ, నూజివీడు

ముసునూరు మండల పరిధిలోని ముసునూరు, రమణక్కపేట, గుడిపాడు, వేల్పుచర్ల, గోపవరం, చెక్కపల్లి, కాట్రేనిపాడు, గురుకుల పాఠశాలల్లో కలిపి ఈ ఏడాది 200 మందికి పైగా విద్యార్థినులు పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కేవలం ముసునూరు హైస్కూల్‌లోనే 34 మంది బాలికలు పాసయ్యారు. వీరిలో కనీసం 15 మందిని కూడా ఇంటర్‌లో చేర్పించలేకపోవడంపై ఉపాధ్యాయుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే చేరగా.. ఆ విద్యార్థిని కూడా పరీక్షల్లో ఫెయిలైంది. నలుగురు పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌)లు ఉన్నప్పటికీ, ఉన్న ఒక్క విద్యార్థినిని కూడా పాస్‌ చేయించలేకపోవడం ఇక్కడి విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement