కఠిన చర్యలు తీసుకుంటాం
● కొల్లేరు అభయారణ్యంలో వింత పరిస్థితి
● ప్రజాప్రతినిధుల అండతో
రెచ్చిపోతున్న వైనం
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల గట్ల నిర్మాణం యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు కొల్లేరు ప్రజలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నాయకులు మాత్రం ఓట్ల రాజకీయం కోసమే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు నాటకీయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నడుమ, అక్రమార్కులు చీకటి చాటున చెరువు గట్లను నిర్మిస్తున్నారు. కై కలూరు మండలం వడ్లకూటితిప్ప వద్ద రహదారికి సమీపంలో, గతంలో ‘కొల్లేరు ఆపరేషన్’ సమయంలో ధ్వంసం చేసిన చెరువు గట్లను ఇప్పుడు పగటిపూటే పూడ్చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయంటూ అక్రమార్కులు బహిరంగంగానే సవాళ్లు విసురుతుండటం గమనార్హం.
నిబంధనలు బేఖాతరు
కై కలూరు మండలం పెంచికలమర్రు శివారు మంచినీటి చెరువు సమీపంలో, దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మూడు చెరువులను అదే గ్రామానికి చెందిన ఓ ప్రముఖ అక్రమార్కుడు సాగు చేస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువులను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ, అక్కడ కూల్చకుండా వదిలేసిన ఒక షెడ్డును కేంద్రంగా చేసుకుని ఇతడు కార్యకలాపాలు సాగిస్తున్నాడు. జీవో నెంబర్ 120 ప్రకారం కొల్లేరు అభయారణ్యంలోకి కనీసం అగ్గిపెట్టె తీసుకెళ్లడం కూడా నేరమే. అలాంటిది అటవీ శాఖ నిబంధనలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇక్కడ గట్ల నిర్మాణం సాగుతోంది. రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుంటూ అక్రమ సాగులో ఆరితేరిన సదరు వ్యక్తి, కూటమి ప్రభుత్వ పాలనలో మరింత రెచ్చిపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
కూలీలతో వ్యూహాత్మకంగా..
రాజకీయ ఎత్తుగడలు తెలిసిన సదరు అక్రమార్కుడు, పొక్లెయిన్లతో గట్లు వేస్తే అధికారులకు అనుమానం వస్తుందని భావించి.. నిఘా నుంచి తప్పించుకునేందుకు రోజువారీ కూలీలను రంగంలోకి దించాడు. గత కొన్నేళ్లుగా ఇతడు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల మద్దతు ఉండటంతో అటవీ శాఖ అధికారులను సైతం ఖాతరు చేయడం లేదు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్‌ఓ విజయ సదరు అక్రమ సాగుపై కొరడా ఝుళిపించారు. అయితే, ఆమె బదిలీ కావడం అక్రమార్కులకు కలిసివచ్చింది. రానున్న వర్షాకాలంలో గట్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు కూలీలతో ముందుగానే వాటిని పటిష్ఠం చేయిస్తున్నాడు. గతంలో అటవీ శాఖ ఇతనిపై అనేక కేసులు నమోదు చేసినా వైఖరి మారలేదు. సదరు వ్యక్తి తమకు పెద్ద తలనొప్పిగా మారాడని అటవీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
కొల్లేరు అభయారణ్య పరిధిలోని వడ్లకూటితిప్ప వద్ద కూలీలతో అక్రమంగా గట్టు వేయిస్తున్న ఉదంతం మా దృష్టికి వచ్చింది. వెంటనే స్థానిక డీఆర్వో, ఎఫ్‌బీవోలను అక్కడికి పంపించి పనులను నిలిపివేయించాం. అభయారణ్యంలో గట్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.రామలింగాచార్యులు, అటవీ శాఖ రేంజర్, కై కలూరు


