ప్రకృతిలో జీవవైవిధ్యం తగ్గే ప్రమాదం
గీతకార్మికులు ఉపాధి కోల్పోతున్నారు
● ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు
● పర్యావరణానికి ముప్పు అంటున్న నిపుణులు
భీమవరం: మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా.. జిల్లాలో తాటిచెట్లను విచ్చలవిడిగా నరికి ఇటుకల బట్టీల్లో ఇటుకలను కాల్చడానికి వాడుతున్నారు. దీనితో వాతావరణంలో కాలుష్య నివారణకు, లక్షలాదిమంది కల్లుగీత కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడుతున్న తాటిచెట్లు కనుమరవుతున్నాయి. ఒకప్పుడు కాలువగట్లు, ఖాళీస్థలాల్లో విఫరీతంగా పెంచిన తాటిచెట్లను ప్రస్తుతం విచ్చలవిడిగా నరికివేస్తున్నా పట్టించుకునే నాథుడు కన్పించడం లేదు. గ్రామాల్లో భవనాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు తాటి చెట్టతో నిర్మించిన తాటిఆకులను పైకప్పుగా వేసుకునే ఇళ్లల్లోనే జీవనం సాగించేవారు. చల్లదనానికి ఎంతో అనువైన తాటి ఆకుల పందిళ్లు ఇళ్లముందు దర్శనమిచ్చేవి. తాటిచెట్ల నుంచి కల్లుతీసి కల్లు విక్రయాలే గాకుండా తాటిబెల్లం తయారీ వంటివాటికి ఉపయోగించి అనేకమంది జీవనోపాధి పొందేవారు. తాటిచెట్టుకు సంబంధించిన ఆకులతో చాపలు, వివిధ రకాల బుట్టలు వినియోగించేవారు. అయితే నేడు తాటిచెట్లు కనబడడం అరుదుగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో ఇటుకలకు గిరాకీ పెరగడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటుకల బట్టీలు వెలవడంతో తాటిచెట్లను నరికి ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్నారు. దీనితో ఎక్కడా తాటిచెట్టు కన్పించే పరిస్థితి కానరావడం లేదు. వేసవి సమయంలో చేల గట్లు, కాలువ గట్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో ఉండే తాటిచెట్లను నరికి ఇటుకల బట్టీల వద్ద గుట్టలుగా నిల్వచేసుకుంటున్నారు.
తాటిచెట్ల ఉపయోగాలు
తాటిచెట్టు ఆక్సిజన్‌ను విడుదల చేసి కార్బన్‌డైఆకై ్సడ్‌ను తీసుకుంటుంది. గాలిలోని దూళి కణాలను ఒడిసిపట్టి గాలిని శుద్ధి చేస్తుంది. తాటిచెట్ల వేర్లు మట్టిని బలంగా పట్టుకుని నేలక్షయాన్ని నివారిస్తుంది. వర్షపునీటిని భూమిలోనికి చొప్పించి నీటి నిల్వకు సహాయపడుతుంది. తాటిఆకులు సూర్యకిరణాలను అడ్డగించడంతో వాతావరణాన్ని చల్లగా ఉంచడం వంటి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. తాటిచెట్లను విచ్చలవిడిగా తొలగించడం వలన ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తాటిచెట్ల తొలగింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బొరాసిస్‌ఫ్లా బెల్లీఫెర్ అనే శాసీ్త్రయనామం కలిగిన తాటిచెట్ట మట్టజాతికి చెందినది. కాలువలు, బోదెలకు ఇరువైపులా తాటిచెట్లను పెంచడం వల్ల మట్టి క్షయాన్ని తగ్గించి గట్లు ధృఢంగా ఉండేందుకు దోహదపడతాయి. తాటిచెట్లు తగ్గడం వల్ల ప్రకృతిలో జీవ వైవిధ్యం తగ్గే ప్రమాదముంది.
– డాక్టర్ కె మల్లిఖార్జున, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, డీఎన్నార్ కళాశాల, భీమవరం
తాటిచెట్లను ఇటీవల విచ్చల విడిగా నరికివేయడం వల్ల కల్లుగీత కార్మికులు ఉపాధినికోల్పోతున్నారు. గీతకార్మికులు ఇప్పటికీ మద్యం బెల్ట్‌షాపులు కారణంగా కల్లు అమ్మకాలు తగ్గి ఇబ్బందులు పడుతుంటే తాటిచెట్లు తగ్గిపోవడం వల్ల కల్లుతీసే అవకాశాన్ని కోల్పోతున్నారు.
– జుత్తిగ నర్సింహమూర్తి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


