నూజివీడు: నేటి సమాజంలో ఒత్తిడి, నిరాశ, అపజయాలు, ఒంటరితనం వంటి సమస్యలతో అనేక మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంపై ఆశ కోల్పోయే వారికి ధైర్యం, ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో రచించిన ‘ఏం ఇంత బాధ ప్రాణం తీసుకునేంత?’ అనే పుస్తకాన్ని ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, ఎలాంటి సమస్య వచ్చినా ‘ప్రాణం కంటే గొప్పది మరొకటి లేదు’ అనే సందేశాన్ని ఈ పుస్తకం చాటుతుందని పేర్కొన్నారు. ఈ పుస్తక రచయిత గుమ్మడిదల జయకృష్ణ మాట్లాడుతూ ఏ సమస్యా జీవితానికంటే పెద్దది కాదనే సందేశాన్ని అందించాలనే సాధారణ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్, ఆర్జీయూకేటీ నూజివీడు డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, డీన్ అకడమిక్స్ దువ్వూరు శ్రావణి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ డీవీ నాగార్జునదేవి, నూజివీడు ఏఓ బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


