స్వామీ.. కష్టాలకు కారణమేమి! | - | Sakshi
Sakshi News home page

స్వామీ.. కష్టాలకు కారణమేమి!

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తులకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో అధికారులు రూ. 12.50 కోట్లతో నిర్మించిన నూతన క్యూ కాంప్లెక్స్‌ ఇటీవల ప్రారంభమైంది. అప్పటి నుంచి చినవెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులు రద్దీ సమయాల్లో పలు ఇక్కట్లకు గురవుతున్నారు. దానికి కారణం నూతన క్యూ కాంప్లెక్స్‌లో ఏవైనా లోపాలున్నాయా.. లేక పరిపాలనా విభాగంలో ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు, సిబ్బంది జోక్యం పెరగడమే కారణమా అన్న ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని తాత్కాలిక వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సుమారు ఆరేళ్ల పాటు భక్తులకు సేవలందించింది. ఆ క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు వినియోగించేవారు. రూ.100, రూ.200 టికెట్లు పొందిన వారు క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండకుండా, అందులో ఉన్న క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించేవారు. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు తీసుకున్న వారు తూర్పు రాజగోపురం మీదుగా ఆలయంలోకి వెళ్లేవారు. అప్పుడే ఏ ఇబ్బంది కలుగలేదు. అయితే ప్రస్తుత నూతన క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో మొదటి దాన్ని రూ.200, రెండో దాన్ని రూ.100 టికెట్లు తీసుకున్న భక్తులకు కేటాయిస్తున్నారు. మిగిలిన నాలుగు కంపార్ట్‌మెంట్లను ఉచిత దర్శనం భక్తులకు వినియోగిస్తున్నారు.

సమస్య ఇక్కడే మొదలు

కొత్త క్యూ కాంప్లెక్స్‌లో ఉచిత దర్శనం భక్తులకు కేటాయించిన నాలుగు కంపార్ట్‌మెంట్లు వారికి చాలడం లేదు. అలాగే రూ.100, రూ.200 టికెట్లు తీసుకున్న వారికి కూడా కంపార్ట్‌మెంట్లు సరిపోవడం లేదు. దాంతో భక్తులతో క్యూలైన్లు కిక్కిరుస్తున్నాయి. ఈ క్రమంలో ఉచిత దర్శనం భక్తులతో సమానంగా తమను పంపుతున్నారని టికెట్లు కొనుగోలు చేస్తున్న భక్తులు మండిపడుతున్నారు. అది కూడా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. టికెట్లు కొనుగోలు చేసిన వారిని కంపార్ట్‌మెంట్లలోకి కాకుండా గతంలో వలె క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి పంపాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇలా చేస్తే ఉచిత దర్శనం భక్తులకు రెండు కంపార్ట్‌మెంట్లు పెరిగి, కాస్త వారికి కూడా ఉపశమనం కలుగుతుంది.

నెరవేరని లక్ష్యం

అన్ని సౌకర్యాలతో కూడిన దర్శనాన్ని భక్తులకు కల్పించాలన్నదే ఆలయ అధికారుల లక్ష్యం. అయితే క్యూ కాంప్లెక్స్‌ నిండిపోయిన తరువాత భక్తులు నూతన అనివెట్టి మండపం పక్కన లక్షలాది రూపాయలతో నిర్మించిన క్యూలైన్లలో అధిక సమయం నిలబడాల్సి వస్తోంది. భక్తులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. అధికారుల లక్ష్యం ఎలా నెరవేరినట్టని పలువురు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన పాత తాత్కాలిక క్యూ కాంప్లెక్స్‌ను ఈ క్యూలైన్ల స్థానంలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని భక్తులు వాపోతున్నారు.

ఇంజనీరింగ్‌ విభాగ జోక్యం

పరిపాలనా విభాగంలో ఇంజనీరింగ్‌ విభాగ అధికారుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాల్లో ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు, సిబ్బంది ఆలయంలోని పలు కీలక విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఏఈఓలు, సూపరింటెండెంట్లపై సైతం పెత్తనం చేస్తున్నారని, దాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాద్యత వహించాల్సింది పరిపాలనా విభాగం వారే. ఇంజనీరింగ్‌ విభాగం వారు కేవలం పరిపాలనా విభాగం అధికారులు కోరిన విధంగా ఏర్పాట్లు చేయాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో పనిచేస్తున్నారని కొందరు సిబ్బంది బాహాటంగా చెబుతున్నారు. లోలోపల జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు కారణంగా భక్తులకు కావాల్సిన సమాచారం సైతం వారికి పూర్తిస్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన నూతన క్యూ కాంప్లెక్స్‌

అప్పటి నుంచి భక్తులకు మొదలైన ఇక్కట్లు

ఇంజనీరింగ్‌ విభాగ అధికారుల జోక్యంపై క్షేత్రంలో చర్చ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement