జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాశనలు, వాహన పూజలను అర్చకులచే జరిపించుకున్నారు. సుమారు 3,321 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.3,33,961 ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్‌వీ చందన, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ తెలిపారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ‘ఏపీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్, జలవిద్యుత్ కేంద్రంతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ బృందంలో సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా ఉన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ బాలకృష్ణ, డీఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్టు జీఎం ఎ.గంగాధర్, డీజీఎం మురళి పమ్మి అధికారులకు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు, పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖలతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ కే.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్‌కి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జీ జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సీఎస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.


