● 4.4 కేజీల బంగారం మాయమైనట్లు గుర్తింపు
● ముగిసిన తనిఖీలు
జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ బంగారం కుంభకోణం (గోల్డ్‌మాల్) తనిఖీలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి (7వ తేదీ మినహా) వరుసగా 10 రోజుల పాటు పోలీసుల సమక్షంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మొత్తం 2,756 బంగారు రుణ ఖాతాలను పరిశీలించగా, అందులో 139 ఖాతాలకు సంబంధించిన 4.4 కేజీల (4,399.70 గ్రాములు) బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారించారు. బ్యాంకుకు రాని ఖాతాదారులు ఎప్పుడు వచ్చినా వారి సమక్షంలోనే వారి బంగారు వస్తువుల ప్యాకెట్లను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ బంగారాన్ని పరిశీలించగా 30 కాసులు (240 గ్రాములు) మాయమైనట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వందలాది మంది ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులు టోకెన్లు ఇచ్చి వరుసగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని బంగారం ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా రోల్డ్‌గోల్డ్, ఇత్తడి, చాక్‌పీసులు, స్టాప్‌లర్ పిన్‌ల బాక్సులు ఉంచినట్లు గుర్తించడంతో అధికారులు అవాక్కయ్యారు. మొత్తం తనిఖీలు పూర్తయ్యేసరికి మాయమైన బంగారం విలువ రికార్డు స్థాయిలో 4.4 కేజీలకు చేరింది. ఎక్కువ బంగారం పెట్టి తక్కువ రుణం తీసుకున్న ఖాతాలు, అలాగే రెన్యువల్ చేసిన ఖాతాల నుంచే ఎక్కువ శాతం బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారుల పత్రాలపై ఎక్కువ బంగారం చూపి, బ్యాంకు రికార్డుల్లో తక్కువ చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాకర్లలోని బంగారం మాయం కావడం వెనుక కేవలం అప్రయిజర్ రాజు పాత్రే కాకుండా, బ్యాంకు సిబ్బంది, కస్టోడియన్ల హస్తం కూడా ఉండి ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు.


