ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎంజె అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్ తదితరులు ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 323 అర్జీలు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు స్వీకరించిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువు లోపుగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు నాణ్యత పరిష్కారంతో, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గతంలో ఎయిడెడ్ పాఠ శాలలుగా పనిచేసి ప్రస్తుతం మండల పరిషత్ యాజమాన్యంలో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ నిధులు తక్షణమే మంజూరు చేసి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ –1938 ఏలూరు జిల్లా నాయకులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు ఫెడరేషన్ నాయకులు సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాల నిర్వహణ నిధులు కీలకమని వివరించారు. తక్షణమే నిర్వహణ నిధులు విడుదల చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ –1938 జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, ఉపాధ్యక్షుడు డీ శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి పీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వృద్ధులపై వేధింపులను మానవహక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. వృద్ధులపై వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా సోమవారం మాదేపల్లి రోడ్‌లోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో శ్రీలక్ష్మి మాట్లాడుతూ వృద్ధాప్యంలో సరైన గౌరవం, ఆదరణ, జీవన భద్రత అందేలా చూడాలని, వృద్ధుల సంక్షేమం కోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆస్తుల కోసం వేధించడం, ఒంటరితనం వారిని తీవ్రంగా కుంగదీస్తున్నాయన్నారు. పెద్దలకు ఏదైనా అత్యవసర సహాయం, లేదా వేధింపుల సమస్య ఉంటే 15100 కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. వృద్ధుల భద్రత, శ్రేయస్సును పెంచడంలో సహాయపడే వనరులు, సేవలను, వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేలా ప్రపంచాన్ని ప్రోత్సహించడం ఈ అవగాహన దినోత్సవ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది పీ. వెంకటేశ్వరరావు, వృద్ధాశ్రమం కార్యదర్శి కే.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎంఎన్‌వీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


