కొల్లేరులో నో రూల్స్‌ | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో నో రూల్స్‌

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

కై కలూరు: లంక గ్రామాల్లో పెద్దల ముసుగులో ప్రభుత్వానికి సమాంతర పాలన సాగిస్తోన్నారు. గ్రామానికి తాగునీటిని చేరేవేసే పంట బోదెను పూడ్చేశారు. ఈ పంటబోదెలో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి పనులు సైతం జరిగాయి. ఇరిగేషన్‌, డ్రెయినేజీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు మాకు తెలీదు.. అంటే మాకు తెలీదు అంటూ తప్పించు కుంటున్నారు. కొల్లేరు లంక గ్రామాల్లో పెంచికలమర్రు గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2,500 మంది జనాభా ఉన్నారు. సమీప 17 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఉద్ధేశంతో పెంచికలమర్రులో 2000లో సమగ్ర రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించారు. ఇందుకుగాను మూడు తాగునీటి చెరువులు ఉన్నాయి. ఇటీవల ఈ చెరువుల్లో రొయ్యలసాగు వివాదంగా మారింది. పెంచికలమర్రులో సగంలో ఆగిపోయిన సచివాలయ భవనం సమీపంలో 7 ఎకరాల మంచినీటి చెరువు ఉంది. దాదాపు 300 మీటర్ల పంట బోదె ద్వారా ఆలపాడు నుంచి వచ్చే నీరు చెరువులో నింపుతారు. అత్యవసరమైన పంట బోదెను ఏటా ఉపాధి పనుల్లో బాగు చేయిస్తున్నారు. ఏకంగా బోదెను కొన్ని రోజుల క్రితం పూడ్చేశారు. అడుగున తూములు పెట్టామని చెబుతున్నారు. ఆక్రమణల వల్ల ఆలపాడు నుంచి వచ్చే మంచినీటిని చెరువులో నింపే అవకాశం ఉండదు. గ్రామ పెద్దలను కాదని అధికారులు పంట బోదె ఘటనపై కనీసం కన్నెత్తి చూడటం లేదు.

మా పరిధి కాదంటే మాది కాదు

తాగునీటి చెరువుకు నీటిని పంపించే పంట బోదె పూడ్చడంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగబాబును వివరణ కోరితే మాకు సంబంధం లేదన్నారు. ఇరిగేషన్‌ డీఈ శిరిషకు విషయం చెబితే ఉపాధి పనులు బోదెకు జరిగితే పంచాయతీకి సంబంధించినదని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ ప్రసాద్‌ను వివరణ కోరితే పెద్దలు అందరూ కలసి తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేమన్నారు. గ్రామ వీఆర్వో నీలయ్యను ప్రశ్నించగా.. వీఆర్‌ఏతో కలిసి పరిశీలిస్తానని చెప్పారు. పూర్వ కాలం నుంచి నీటిని సరఫరా చేసే పంటబోదెను పూడ్చడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పెంచికలమర్రులో పంటబోదె పూడ్చివేత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement