పోలవరం రూరల్: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని గ్రామస్తులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం మండలంలోని ఇటికలకోట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల స్థాయి తగ్గింపు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులను తొలగించడం దుర్మార్గపు చర్య అని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ విమర్శించారు. పాఠశాలలో కేవలం 3 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇటికలకోట పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని, గతంలో కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఇక్కడి సిబ్బందిని అభినందించారని గుర్తుచేశారు. ఏలూరు జిల్లాలో రేషనలైజేషన్ విధానాల వల్ల 21 పాఠశాలల్లో విద్యార్థులకు చదువు దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో తరగతులు తగ్గించడం సరికాదని, కోర్సవారిగూడెం, కోయనాగంపాలెం గ్రామాల్లో పిల్లలున్నా పాఠశాలలు తెరవడం లేదని ఎత్తిచూపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేనిపక్షంలో తల్లిదండ్రులు, గ్రామస్తులను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


