పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తం
● సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం
● ముందుగానే టీకాలు వేయడం ఉత్తమమంటున్న పశు వైద్యులు
● చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధులు దూరం
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి సరైన చికిత్స చేయించాలని సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
పశువులకు వచ్చే వ్యాధుల్లో కొన్ని..
బ్లూటంగ్– ఫుట్‌రాట్ లక్షణాలు
గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతి వావు, పెదవులు దద్దరించడం, నోటి లోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం జరుగుతుంది. 30 శాతం వరకూ మరణాలు సంభవించవచ్చు. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి.
కాళ్ల పుండ్ల వ్యాధి సోకితే
జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేత వేసేలా చూడాలి.
గొంతువాపు వ్యాధి
పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో పశువులు తడవకుండా చూడాలి.
నివారణ చర్యలు
జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి.
చిటిక వ్యాధి
ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. తొలకరి వర్షాలు కురిసే సమయంలో సోకుతుంది. ఏడాది వయసు గల గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. వ్యాధి లక్షణాలు ఉదయం, మధ్యాహ్నం వేళ గొర్రెల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి నివారణకు వర్షాలకు ముందే గొర్రెలకు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి.
వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు. పశువులకు సోకే వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి.
మల్లంపల్లి సాయిబుచ్చారావు, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ


