నేవీ డిపో రద్దుతో పూజలు | - | Sakshi
Sakshi News home page

నేవీ డిపో రద్దుతో పూజలు

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

నేవీ డిపో రద్దుతో పూజలు నారసింహుడికి విశేష పూజలు గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు ట్రస్ట్‌ బోర్డు నియామకాల్లో అన్యాయం స్వర్ణమయ పథకానికి రూ.లక్ష విరాళం

కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదన రద్దు కావడంతో పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు ఆదివారం పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆలయాలలో నైవేద్యాలు సమర్పించారు. వేలాది మంది రైతుల గోడు తమ గ్రామ దేవతలు విని ఆయుధ డిపో రద్దయ్యేలా అనుగ్రహించారని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఊట్లగూడెం సమీపంలోని కొవ్వాడమ్మ ఆలయం వద్ద అదే విధంగా బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కెట్‌ నగర్‌, రేగులగుంట తదితర గ్రామాలలో గ్రామస్తులు పూజలు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్‌ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. చతుర్ధశి తిధిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్‌్‌కు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే హోమాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నారసింహునికి మహా నివేదనను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు.

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

పెనుగొండ: ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రస్తావించారని వైఎస్సార్‌ సీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ కన్వీనరు నంబూరి రాజేంద్ర ప్రసాద్‌(రాజా) తెలిపారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచనతో పాల్గొన్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రస్ట్‌ బోర్డుల నియామకాల్లో ఆర్యవైశ్యులకు జరిగిన అన్యాయంపై చర్చ జరిగిందని వివరించారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి ఓ భక్తుడు రూ.1,00,000 విరాళంగా అందజేశారు. సామర్లకోటకు చెందిన దాత జె.రామలక్ష్మణులు ముందుగా కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement