3.212 కేజీల బంగారం మాయం | - | Sakshi
Sakshi News home page

3.212 కేజీల బంగారం మాయం

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలో ఆదివారం కూడా బ్యాంకు అధికారులు ఖాతాలను పరిశీలించారు. శని, ఆదివారాలు సెలవు అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరిచి ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం పరిశీలించారు. ఆదివారం పరిశీలనలో 47 ఖాతాదాలను పరిశీలించగా, ఒక ఖాతా మాత్రం తేడా వచ్చింది. ఆ ఖాతాలో 12 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది. దీంతో ఇంతవరకు 3.212 కేజీల బంగారం మాయమైంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారం ఖాతాలు 2756 ఉన్నట్లు తెలిసింది. ఇంతవరకు 1961 ఖాతాలను పరిశీలించారు. దీనిలో 1873 ఖాతాలకు సంబంధించి బంగారం సరిపోగా, 88 ఖాతాలకు మాత్రం మొత్తంగా 3.212 కేజీల బంగారం మాయమైంది.

అసలు ఏం జరిగిందంటే...?

బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారానికి సంబంధించి బంగారం మాయమైనట్లు చూచాయిగా బయటకు లీకై ంది. దీంతో ఈ నెల 2న అప్రైజర్‌ కలపాక రాజును బ్యాంకు అధికారులు పిలిపించి మాట్లాడారు. 2వ తేదీ పగలు బ్యాంకుకు వెళ్లిన రాజును మాయమైన బంగారంపై బ్యాంకు అధికారులు నిలదీసినట్లు తెలిసింది. దీంతో రాజు బ్యాంకు ఖాతాల్లో తాను తీసి వాడుకున్న బంగారానికి సంబంధించి ఎంతైతే వాడుకున్నాడో అంతా ఇచ్చేసినట్లు సమాచారం. అయితే బ్యాంకు అధికారులు 2వ తేదీ అర్ధరాత్రి వరకు రాజును కూర్చోబెట్టి అతనితో మిగిలిన బంగారానికి కూడా రాజే బాధ్యుడని రాయించుకుని పంపినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన రాజు 3వ తేదీ ఉదయం రాజు, అతని తల్లిదండ్రులతో జంగారెడ్డిగూడెం వదిలి వెళ్లిపోయినట్లు తెలిసింది. భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది. సోదరుడి కుటుంబం జంగారెడ్డిగూడెంలో ఉన్నట్లు సమాచారం. కుటుంబసభ్యులను కూడా తాను ఫలానా చోట ఉన్నాను రమ్మని రప్పించుకున్నట్లు తెలిసింది. వారు వెళ్ళిన తరువాత వారితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి రాజు కనిపించడం లేదు. రాజు తన కుటుంబసభ్యులతో తాను వాడుకున్న బంగారం బ్యాంకులో జమ చేశానని, మిగిలిన బంగారం గురించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి రాజు సెల్‌ఫోన్‌ పనిచేయకపోగా, ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఈ నెల 6న ముగ్గురు ఖాతాదారులు తమ ఖాతాలను పరిశీలించేందుకు రాగా, అదే రోజున 240 గ్రాములు మాయమైనట్లు గుర్తించారు.

అసలు బంగారం అంతా ఏమైంది...?

బ్యాంకు ఆఫ్‌ బరోడాలో ఆదివారం వరకు మాయమైన 3.212 కేజీల బంగారం అసలు ఏమైంది. బంగారం బయటకు వెళ్ళడంలో రాజుతో పాటు మిగిలిన అధికారులు, కస్టోడియన్ల పాత్ర ఎంత అనేది తేలాల్సి ఉంది. లాకర్‌లో భద్రపరిచిన బంగారం బయటకు రావాలంటే ఒక్క అప్రయిజర్‌ వల్ల సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద వస్తువులైన వడ్డాణం, హారాలు, బిస్కెట్‌లు కూడా మాయమయ్యాయి. కుదువ పెట్టినా, లేక కరిగించి అమ్మివేసి ఉన్నా లేక ఆభరణాలు కింద అమ్మేసినా రికవరీ అయ్యే అవకాశం ఉంది.

ఆదివారం కూడా కొనసాగిన ఖాతాల పరిశీలన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement