పోటెత్తిన భక్తులు.. దర్శనానికి అష్టకష్టాలు | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన భక్తులు.. దర్శనానికి అష్టకష్టాలు

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

సరిగ్గా మంచినీరు కూడా అందని పరిస్థితి

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో శనివారం భక్తులు అష్టకష్టాలు పడ్డారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరచుకోవడంతో సుమారు 30 వేల మంది భక్తులు చినవెంకన్నను దర్శించుకున్నారు. అయితే వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ఆలయ సిబ్బంది విఫలమయ్యారు. నూతన అనివెట్టి మండపం పక్కన నిర్మించిన క్యూలైన్ల లోంచి, నూతన క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు భక్తులకు కొన్ని గంటల సమయం పట్టింది. ఓ పక్క ఉక్కబోత, మరో పక్క సక్రమంగా మంచి నీరు అందక భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇదిలా ఉంటే వాట్సాప్‌ మనమిత్రా సేవలను విస్తృత పరిచేందుకు, కియోస్క్‌ యంత్రాల సేవలను నిలుపుదల చేయడంతో భక్తులు మరింత అసౌకర్యానికి గురయ్యారు.

సైడ్‌ లైట్స్‌

● కియోస్క్‌ యంత్రాలను నిలుపుదల చేసి, వాట్సాప్‌ మనమిత్రాలో టికెట్లు బుక్‌ చేసుకోవాలని దేవస్థానం సిబ్బంది సూచించడంతో, ఆన్‌లైన్‌ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది సతమతమయ్యారు.

● భక్తులు కొత్త క్యూ కాంప్లెక్స్‌ క్యూ లైన్లలో దాదాపు 3 గంటలు పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వారికి కొన్ని గంటల పాటు మంచి నీరు అందలేదు. దాంతో అక్కడున్న సిబ్బందిపై ఘర్షణకు దిగారు. ఆ తరువాత ఆలయ కార్యాలయానికి వెళ్లి, ఫిర్యాదులు రాసి, వాటిని కంప్లైంట్‌ బాక్స్‌లో వేశారు.

● క్యూ కాంప్లెక్స్‌లోని క్యూలైన్లలో ఏర్పాటు చేసిన హై వాల్యూమ్‌–లో స్పీడ్‌ (హెచ్‌వీఎల్‌ఎస్‌) ఫ్యాన్లు ఉదయం దాదాపు 3 గంటల పాటు పనిచేయలేదు. దాంతో భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

క్యూ కాంప్లెక్స్‌ క్యూలైన్ల ఎమర్జన్సీ ఎగ్జిట్‌ గేట్లకు తాళాలు వేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ తాళాలు పట్టుకుని కంపార్ట్‌మెంట్లలో ఉండిపోయారు. దాంతో దేవస్థానం సిబ్బంది లోపలికి, బయటకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. షుగర్‌ పేషెంట్లు మూత్రానికి వెళ్లే వీలు లేక నానా అవస్థలు పడ్డారు.

● క్లోక్‌ రూమ్‌ అవుట్‌సైడ్‌ ఉండటంతో భక్తులు బ్యాగులతో నేరుగా క్యూ కాంప్లెక్స్‌ వద్దకు వెళుతున్నారు. వాటిని క్లోక్‌రూమ్‌లో పెట్టుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు. అయితే క్లోక్‌రూమ్‌ ఆలయం లోంచి బయటకు వెళ్లే మార్గంలో ఉండటంతో దాన్ని వెదుక్కోవడానికి భక్తులకు సమయం పట్టింది.

● క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు మజ్జిగ, రెండేసి బిస్కెట్లు చొప్పున అందించారు. కానీ క్యూ లైన్లలో ఉన్న వారికి మంచినీరు కూడా అందించలేక పోయారు.

● క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన రూ. 200 ఆన్‌లైన్‌ దర్శనం క్యూలైన్‌ వద్ద సరైన నీడలేక గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. దాంతో భక్తులకు కాస్త ఉపశమనం కలిగింది.

● పాత తాత్కాలిక క్యూ కాంప్లెక్స్‌ దాదాపు 4 వేల మంది భక్తులకు సరిపోయేది. కొత్త క్యూ కాంప్లెక్స్‌ 1,950 మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వారు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.

● సుమారు రూ.40 లక్షలతో నూతన అనివెట్టి మండపం పక్కన ఐరన్‌ పైప్‌లతో క్యూలైన్లు, వాటికి పైకప్పు నిర్మించారు. ఇటీవల గాలి వానకు పైకప్పు ధ్వంసమైంది. నిర్మించి నెల గడవక ముందే అది ధ్వంసం కావడంపై భక్తులు, స్థానికులు విస్తుపోతున్నారు. అయితే ఆ పైకప్పుపై తెల్లని క్లాత్‌ వేసి ప్రస్తుతం భక్తులకు నీడ కల్పించడం గమనార్హం.

● ఓ భక్తురాలు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోవడంతో ఆమెకు ప్రథమచికిత్సా కేంద్రం వైద్యసేవలు అందించారు.

● భక్తులు పోటెత్తారన్న సాకుతో అధికారులు ప్రొటోకాల్‌ కార్యాలయ గేట్లను సైతం మూసివేశారు. దాంతో వీఐపీ దర్శనాలు, ఇతర సమాచారం కోసం అక్కడికి వచ్చిన వారు ఇదేం దారుణమని ముక్కున వేలేసుకున్నారు.

● భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని ఉదయం 8 గంటల నుంచి నిలుపుదల చేశారు. ఇదిలా ఉంటే నూతన అనివెట్టి మండపంలో అన్నప్రాశనలు జరుపుకునేవారి నుంచి రూ. 2,200 రుసుముగా వసూలు చేస్తున్నారు. అదే కింద జరుపుకుంటే రూ. 200 వసూలు చేస్తున్నారు. దాంతో పలువురు ఈ వేడుకలను కిందే జరుపుకున్నారు. మరీ ఇంత కమర్షియల్‌ అయితే ఎలా అని వారు వాపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement