వెన్నుపోటుపై జనాగ్రహం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై జనాగ్రహం

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

వెన్నుపోటుపై జనాగ్రహం హోరెత్తిన వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు

ఏలూరు నియోజకవర్గంలో..

హోరెత్తిన వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు

జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కదం తొక్కిన పార్టీ కేడర్‌

సూపర్‌సిక్స్‌ పేరుతో సూపర్‌ దగా చేశారంటూ నేతలు ధ్వజం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మోసపూరిత హామీలు, సూపర్‌ సిక్స్‌ అంటూ దగా చేసిన కూటమి వెన్నుపోటు పాలనకు రెండేళ్లు ముగియడంతో జనం నిరసన గళం వినిపించారు. సూపర్‌సిక్స్‌ పేరుతో దగా చేసి లెక్కకు మించిన హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్ల పాలనంతా అవినీతిమయమని నేతలు ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్ళు పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల భాగస్వామ్యంతో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ కేడర్‌తో పాటు రైతులు, సామాన్యులు, మహిళలు ఆందోళనకు మద్దతు పలికారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కై కలూరు నియోజకవర్గంతో పాటు ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో జరిగిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.

కూటమి దగాపాలన మెగా డీఎస్సీ పేరుతో మోసాలు, సూపర్‌ సిక్స్‌లోని హామీలను గాలికి వదిలేసిన వైనంపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం, కై కలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.

కై కలూరు నియోజకవర్గంలో..

కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు మండలాలు కై కలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి నుంచి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కై కలూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఆటపాకలోని డీఎన్నార్‌ ఫ్యాక్టరీ వరకు నిరసన ర్యాలీ చేశారు. సంతమార్కెట్‌ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆటపాక వద్ద రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

దెందులూరు నియోజకవర్గంలో..

దెందులూరు నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాలుగు మండలాలు పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్‌, దెందులూరు నుంచి పార్టీ శ్రేణులు హాజరయ్యారు. పెదవేగి మండలం రాట్నాలకుంట నుంచి సోమవరప్పాడు చేరుకుని అక్కడ నుంచి దెందులూరు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు ఎస్‌ఎంఆర్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా బస్టాండ్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం దెందులూరులో దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో..

ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు భీమడోలు, ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు నేతృత్వంలో గణపవరంలో పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌ ఐలాండ్‌ సెంటరు వరకు నిరసన ర్యాలీ చేశారు. ముందుగా సెంటరులో ఉన్న దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటరులో నాలుగు కూడళ్ల వద్ద నిరసన నిర్వహించారు.

నూజివీడు నియోజకవర్గంలో..

నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నూజివీడు, చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు మండలాల నుంచి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు ఆధ్వర్యంలో మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. నూజివీడులోని పార్టీ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

పోలవరం నియోజకవర్గంలో..

పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం, టీ.నర్సాపురం, వేలేరుపాడు, కుక్కునూరు, కొయ్యలగూడెం నుంచి పార్టీ నేతలు కొయ్యలగూడెంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బుట్టాయగూడెం నుంచి కన్నాపురం మీదుగా కొయ్యలగూడెం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కొయ్యలగూడెం సెంటరులో దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

చింతలపూడి నియోజకవర్గంలో..

చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మార్కెట్‌ కమిటీ నుంచి పాత బస్టాండ్‌ సెంటర్‌, బోసుబొమ్మ సెంటర్‌ మీదుగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ సెంటరులో అంబేడ్కర్‌ విగ్రహానికి, ఫైర్‌స్టేషన్‌ సెంటరులో దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫైర్‌స్టేషన్‌ సెంటరులో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

ఏలూరు నియోజకవర్గం ఏలూరులో సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్లమెంట్‌ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌ సెంటర్‌ వరకు భారీగా నిరసన ర్యాలీ చేశారు. ముందుగా పాతబస్టాండ్‌ సెంటరులో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement